తమ చేతుల్లో ఏమీ లేదని రైతులతో వ్యాఖ్యలు

26 May, 2021 08:04 IST|Sakshi

మంత్రులు  నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డికి రైతుల ఫోన్‌

మొక్కజొన్న పంట విషయమై ఆరా

బోథ్‌: రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలని, డిమాండ్‌ లేదనే మొక్కజొన్న పంట వేయవద్దని తెలిపామని, కానీ ప్రత్యామ్నాయ పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, కొనడం కష్టమేనని, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. జొన్నపంటను కొనుగోలు చేయాలని మంత్రులకు ఫోన్‌ చేసిన రైతులతో అన్న మాటలివి.

పంట కొంటామనలేదు..
టీ– శాట్‌ ఛానల్‌లో సోమవారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఫోన్‌ చేసిన రైతులకు పలు సూచనలు చేశారు. బోథ్‌ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన భీమ గోవింద రాజు టి శాట్‌ ఛానల్‌కి ఫోన్‌ చేయగా.. మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయవద్దని చెప్పిందని.. ప్రత్యామ్నాయంగా జొన్నపంట వేశామని, ప్రభుత్వం కొనాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటను వేయాలని మాత్రమే చెప్పామని అన్నారు. ఆ పంటను ప్రభుత్వం కొంటుందని ఎక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు.

మా చేతిలో ఏమీ లేదు: మంత్రి ఐకేరెడ్డి
మండలంలోని ధన్నూర్‌ గ్రామానికి చెందిన పసుల చంటి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి మంగళవారం జొన్న పంట కొనుగోలు చేయాలని  ఫోన్‌లో విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. జొన్న పంటను కొనుగోలు చేయడం మా చేతుల్లో లేదని, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసిందని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటను మాత్రమే వేయాలని రైతుకు సూచించారు. తమ జిల్లాలో 50వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. జొన్న పంట వేయమని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. మంత్రులు పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

>
మరిన్ని వార్తలు