పీవీ గౌరవాన్ని పెంచేలా కార్యక్రమాలు: కిషన్‌రెడ్డి

29 Jun, 2022 01:46 IST|Sakshi

నెక్లెస్‌రోడ్డులోని ఘాట్‌లో ఘనంగా పీవీ జయంతి  

నివాళులర్పించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, నేతలు

సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు మంగళవారం నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబసభ్యులు తదితరులు ఆయన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గౌరవాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఆజాదీకా అమృతోత్సవ్‌ సందర్భంగా పీవీ పేరుపై త్వరలోనే తపాలా బిళ్లను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ పరిపాలన దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తన ఆర్థిక, సరళీకృత విధానాలతో దేశానికి దశ, దిశ చూపిన మాజీ ప్రధాని పీవీ.. భారత జాతిరత్నమని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొనియాడారు. పీవీ స్వగ్రామమైన వంగరలో ఆయన స్మారకంగా చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటిని పూర్తి చేయాలని కోరారు. పీవీ నరసింహారావులాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుని, గౌరవించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. అంతకుముందు పీవీ ఘాట్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా, గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

శాసనసభ ప్రాంగణంలో .,.
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలను శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాబీహాల్‌లో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, లెజిస్లేచర్‌ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.  ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలనాదక్షుడు పీవీ అని, ఈరోజు దేశం ఆర్థిక సమస్యలను తట్టుకుని నిలబడుతుందంటే ఆయన ప్రారంభించిన సంస్కరణలే కారణమని గుత్తా కొనియాడారు.

మరిన్ని వార్తలు