ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ

27 Mar, 2022 01:29 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ 

యాసంగి ధాన్యం కొనుగోలుకు ససేమిరా అంటున్న కేంద్రం మెడలు వంచుతాం

రాష్ట్ర మంత్రుల బృందం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 

బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్‌రెడ్డి 
మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు.

తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 

వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్‌రెడ్డి 
ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్‌ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్‌ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్‌ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు.

కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రాష్ట్రం కొనాలని డిమాండ్‌ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు