Telangana: సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా!

13 Jul, 2021 02:10 IST|Sakshi

ఈ ఏడాది 9 వేల స్కూళ్ల అభివృద్ధి

అందుకోసం రూ.2 వేల కోట్ల ఖర్చు

తొలుత విద్యార్థులు ఎక్కువున్న స్కూళ్లకు ప్రాధాన్యం

ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం నివేదిక

మూడేళ్లలో 27 వేల స్కూళ్లకు రూ.6 వేల కోట్లు

మంత్రివర్గ ఉప సంఘం సూచనలివీ..

  • స్కూళ్లకు పక్కా భవనాలు, అవసరమైన చోట అదనపు తరగతి గదులను నిర్మించాలి. వివిధ పద్ధతుల ద్వారా నిధులను సమీకరించాలి.
  • సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం కింద కేంద్రం నుంచి కొంత మేరకు నిధులు వస్తాయి. 
  • సర్కారీ స్కూళ్లను అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలలకు కొంతైనా పోటీ ఇవ్వొచ్చు.
  • రానున్న రోజుల్లో అదనంగా 10 లక్షల మంది విద్యార్థులు చేరొచ్చని అంచనా.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను విడతల వారీగా అభివృద్ధి చేయాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. మూడేళ్లలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేయాలని పేర్కొంది. మొత్తం 27 వేల స్కూళ్లలో, తొలుత ఈ ఏడాది 9 వేల స్కూళ్లను అభివృద్ధి చేయాలని, అందులో కొన్నింటికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. అందుకోసం ఈ ఏడాది రూ.2వేల కోట్ల మేరకు ఖర్చు చేయా లని సిఫార్సు చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సర్కారుకు నివేదిక సమర్పించింది. మొత్తం అన్ని స్కూళ్ల అభివృ ద్ధికి రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు అవస రమవుతాయని అంచనా వేసింది. మూడేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణులు, విద్యాశాఖ అధికారులతో పలుమార్లు చర్చించిన అనంతరం ఈ నివేదికను తయారు చేసింది. అలాగే అధికారుల బృందం ఏపీలోని నాడు నేడు పథకం స్కూళ్లతో పాటు ఢిల్లీలోని స్కూళ్లనూ పరిశీలించింది.

రాష్ట్రంలో అనేక స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారణకు వచ్చింది. గదులు లేకపోవడం, పాత భవనాలు కావడంతో పెచ్చులూడి పోవడం, ప్రహారీ గోడలు లేకపోవ డంతో పశువులు, ఇతర జంతువులు సంచరించడం, విద్యుత్‌ కనెక్షన్లు లేకపోవడం, కొన్నిచోట్ల ఫ్యాన్లు లేక విద్యార్థులు యాతనలు పడుతున్నారు. గోడలకు పెయింటింగ్‌ వేయకపోవడంతో అనేక స్కూళ్లు బూజు పట్టి దర్శనమిస్తున్నాయి. బల్లలు, కుర్చీలు లేక విద్యా ర్థులు, టీచర్లు కూర్చోవడానికి వీలు లేకుండా పోతుంది. మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు లేక పోవడాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాఠశాలల అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం పలు సూచనలు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు నిధులు సమకూర్చి ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. నివేదిక అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యాశాఖ వర్గాలు వేచి చూస్తున్నాయి. తొలి ఏడాది అత్యధిక విద్యార్థు లున్న స్కూళ్లను ఎంపికచేస్తారని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఒక ఉన్నతాధి కారి తెలిపారు. రెండో ఏడాది కూడా ఇదే పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తారన్నారు.  

మరిన్ని వార్తలు