కౌంటింగ్‌.. ఇంకా వెయిటింగ్‌

20 Mar, 2021 03:37 IST|Sakshi

కొన..సాగుతున్న శాసనమండలి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు

రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం మొదలైన ఎలిమినేషన్‌

అతితక్కువ ఓట్లు పొందిన వారిని తొలగిస్తూ... వారి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 

‘హైదరాబాద్‌’లో నాగేశ్వర్, చిన్నారెడ్డిల ఓట్లలోని ద్వితీయ ప్రాధాన్యంపై ఆధారపడిన ఫలితం

‘నల్లగొండ’లో ఇతర అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లపైనే పల్లా, మల్లన్న, కోదండరాం ఆశలు

నేటి రాత్రికి ఫలితాలొచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి పట్టభద్రుల కోటా స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై మూడు రోజులు గడుస్తున్నా తుది ఫలితం తేలకపోవడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో సహా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పోలై... చెల్లుబాటయ్యే ఓట్లలో 50% + ఒక ఓటును పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏడురౌండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా... ఏ అభ్యర్థీ 50% ఓట్లు (విజ యానికి కావాల్సిన నిర్ణీత కోటా ఓట్లు) సాధించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. అతితక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ (ఆఖరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని మొదట ఎలిమినేట్‌ చేస్తారు. అలా కింది నుంచి పైకి వెళుతూ ఒక్కొక్కరిని ఎలిమినేట్‌ చేస్తారు), వారి బ్యాలెట్‌లో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ (ఎలిమినేషన్‌ విధానం) కొనసాగుతోంది.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’స్థానంలో శనివారం మధ్యాహ్నం వరకు, ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’స్థానంలో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముందని లెక్కింపు సరళి వెల్లడిస్తోంది. అయితే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ పూర్తయిన తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల నడుమ చివరి వరకు గెలుపు దోబూచులాడే అవకాశముందని స్పష్టమవుతోంది. రెండు స్థానాల్లోనూ శనివారం రాత్రికి తుది ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.

‘హైదరాబాద్‌’లో ఇద్దరి నడుమ హోరాహోరీ
‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 93 అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎస్‌.వాణీదేవి (టీఆర్‌ఎస్‌) ఒకటో, ఎన్‌.రామచందర్‌రావు (బీజేపీ) రెండో స్థానంలో నిలిచారు. దీంతో చివరి నిముషం వరకు ఈ ఇద్దరి నడుమ ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశముంది. మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ (స్వతంత్ర), నాలుగో స్థానంలో నిలిచిన జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) బ్యాలెట్లలో వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లపై వాణీదేవి, రాంచందర్‌రావు గెలుపోటములు ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చిన్నారెడ్డి, నాగేశ్వర్‌లు ఎలిమినేట్‌ అయ్యే పరిస్థితి వస్తే వారి బ్యాలెట్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వాణీదేవి, రామచందర్‌రావు నడుమ ఎవరికి ఎక్కువగా వెళితే వారు విజేత అయ్యే అవకాశముంది. విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావాలంటే వాణీదేవి మరో 17.57 శాతం, రాంచందర్‌రావు మరో 19 శాతం ఓట్లు సాధించాల్సి ఉంది. నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు ఇద్దరికీ కలిసి 25.26 శాతం తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్దన్‌రెడ్డి, అన్వర్‌ఖాన్, వేముల తిరుమల బ్యాలెట్లలో వచ్చే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కొంత మేర వాణీదేవి, రాంచందర్‌రావుకు కీలకం కానున్నాయి. 

‘నల్లగొండ’లో ఆ ముగ్గురు నడుమ పోటీ
‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’పట్టభధ్రుల నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) మొదటి స్థానంలో, తీన్మార్‌ మల్లన్న (స్వతంత్ర) రెండు, ప్రొఫెసర్‌ కోదండరాం (టీజేఎస్‌) మూడో స్థానంలో నిలిచారు. అయితే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య పరంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కంటే సుమారు 7.5 శాతం ఓట్లు అదనంగా సాధించారు. కోదండరాం కంటే తీన్మార్‌ మల్లన్న సుమారు 2.5 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. పల్లా ముందంజలో ఉన్నా మల్లన్న, కోదండరాంలకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే...ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), ఎస్‌.రాములు నాయక్‌ (కాంగ్రెస్‌) బ్యాలెట్స్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మల్లన్న, కోదండరాం గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వీరితో పాటు జయసారధిరెడ్డి (సీపీఐ), చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ), రాణీరుద్రమ (యువ తెలంగాణ) బ్యాలెట్‌లలోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరాం సాధించే ఫలితంపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది.

తేలని లెక్క.. కొనసాగుతున్న ఉత్కంఠ
పట్టభద్రుల స్థానాల కోటా ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై స్పష్టత రాకపోవడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జన సామాన్యానికి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్‌ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎవరికి వారుగా తుది ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ‘హైదరాబాద్‌’లో 93, ‘నల్గొండ’లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎలిమినేషన్‌ విధానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నెమ్మదిగా జరుగుతోంది. ఎలిమినేషన్‌ ప్రక్రియలో శుక్రవారం రాత్రికి రెండు స్థానాల్లోనూ కేవలం ఐదారుగురు అభ్యర్థులు మాత్రమే లెక్కింపు బరిలో మిగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్‌ మల్లన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంకు ధీటుగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత
‘హైదరాబాద్‌– రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌’
పోటీ చేసిన అభ్యర్థులు        ః 93
మొత్తం ఓట్లు            ః 5,31,268
పోలైన ఓట్లు            ః 3,58,348
చెల్లని ఓట్లు            ః 21,309
చెల్లిన ఓట్లు            ః 3,37,039
గెలిచేందుకు రావాల్సిన ఓట్లు     ః 1,68,520
ఎస్‌.వాణిదేవి (టీఆర్‌ఎస్‌)        ః 1,12,689 (33.43 శాతం)
ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ)    ః 1,04,668 (31 శాతం)
కె.నాగేశ్వర్‌ (స్వతంత్ర)        ః 53,620 (15.9 శాతం)
చిన్నారెడ్డి (కాంగ్రెస్‌)        ః 31,554 (9.36 శాతం)

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత
‘నల్గొండ– ఖమ్మం– వరంగల్‌’
పోటీ చేసిన అభ్యర్థులు        ః71
మొత్తం ఓట్లు            ః 5,05,565
పోలైన ఓట్లు            ః 3,87,969
చెల్లని ఓట్లు            ః 21,636
చెల్లిన ఓట్లు            ః 3,66,333
గెలిచేందుకు రావాల్సిన ఓట్లు     ః 1,83,167
పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌)    ః 1,10,840 (30.25 శాతం)
తీన్మార్‌ మల్లన్న (స్వతంత్ర)    ః 83,290 (22.73 శాతం)
కోదండరాం    (టీజేఎస్‌)    ః 70,072 (19.12 శాతం)
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ)    ః 39,107 (10.67శాతం)
రాములు నాయక్‌(కాంగ్రెస్‌) : 27,588 (7.53 శాతం)

శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు కలుపుకొని తాజాగా ప్రధాన అభ్యర్థుల ఓట్ల వివరాలు
‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’
పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌)    ః 1,11,190 ఓట్లు
తీన్మార్‌ మల్లన్న (స్వతంత్ర)    ః 83,629 ఓట్లు
కోదండరాం    (టీజేఎస్‌)    ః 70,472 ఓట్లు
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ)    ః 39, 268 ఓట్లు
రాములు నాయక్‌(కాంగ్రెస్‌) : 27, 713 ఓట్లు

‘హైదరాబాద్‌– రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌’
ఎస్‌.వాణిదేవి (టీఆర్‌ఎస్‌)        ః 1,12,802 ఓట్లు 
ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ)    ః 1,04,965 ఓట్లు
కె.నాగేశ్వర్‌ (స్వతంత్ర)        ః 53,687 ఓట్లు 
చిన్నారెడ్డి (కాంగ్రెస్‌)        ః 31,602 ఓట్లు
 

ఎలిమినేషన్‌ ఇలా
సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. మొత్తం పోలైన ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగం + ఒక ఓటు... విజయానికి కావాల్సిన నిర్ణీత కోటా (50%+1) అవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ ఈ కోటాను చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు పది మంది అభ్యర్థులు రంగంలో ఉంటే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని (అంటే 10వ స్థానంలో నిలిచిన అభ్యర్థిని) మొదట ఎలిమినేట్‌ చేస్తూ...ఆ అభ్యర్థి బ్యాలెట్‌లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలుపుతారు. పదో వ్యక్తి ఎలిమినేట్‌ అవడంతో.. 9 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు లెక్క.

ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన ఉన్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలిపి... వారికి వచ్చిన మొత్తం ఓట్లుగా పరిగణిస్తారు (ఎలిమినేట్‌ అయిన పదో అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లలో ఒకవేళ తొమ్మిదవ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చి ఉంటే.. ఆ బ్యాలెట్‌ పేపర్లలోని మూడో ప్రాధాన్యత ఓట్లను పైనున్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి కలుపుతారు). తర్వాత 8వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్‌ చేస్తారు. ఇతనికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే ఏడుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే.. వారికి ఆ ఓట్లను కలుపుతారు. ఇలా ఎలిమినేట్‌ ఆయ్యే క్రమంలో పైనున్న స్థానాల్లోని అభ్యర్థుల్లో ఎవరికైనా 50 శాతం ఓట్లతో పాటు ఒక్క ఓటు అదనంగా వచ్చినా .. వారిని విజేతగా ప్రకటిస్తారు. అక్కడితో (ఆ ఎలిమినేషన్‌ రౌండ్‌తో) కౌంటింగ్‌ ప్రక్రియను నిలిపివేస్తారు. 

ఇద్దరే మిగిలితే... ఎక్కువ ఓట్లున్న వారే విజేత
నిర్ణీత కోటా ఓట్లను ఎవరూ సాధించలేని పక్షంలో పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు ఈ ఎలిమినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరికీ నిర్ణీత కోటా ఓట్లు (50 శాతం + 1 ఓటు) రాకపోయినా సరే... ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారని నల్లగొండ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని విజేతను ప్రకటిస్తారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు