పోరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు 

23 Jan, 2023 00:52 IST|Sakshi
రామప్ప దేవాలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌  

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వెంకటాపురం(ఎం): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరాటం.. స్థానిక ప్రజల పోరాటంతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అదివారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి ఆమె సందర్శించారు. రామప్ప ఆలయ ఈఓ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.

తర్వాత వారు ఆలయంలో రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్‌లో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రామప్ప ఆలయం ఉన్నందున గుడికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని, ఆలయ పరిసరాల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’.. ములుగు జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం 334 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించారు. ములుగు జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటైందని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.

కాగా, రూ.1,800 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీని నిర్మించినట్లు పేర్కొన్నారు. గోదావరి పరీవాహక కోత ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం రూ.130 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్కో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు