ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి విజయం

17 Mar, 2023 08:27 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి:  ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ 12,709 దాటలేదు.

దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లు పరిశీలిస్తే..
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వీరిలో ఏవీఎన్‌రెడ్డి 7505 ఓట్లు (మొదటి ప్రాధాన్యత) సాధించగా, గుర్రం చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లు పొందారు. యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డి 4569 ఓట్లు పొందారు. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి అతి తక్కువగా 1,236 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక హర్షవర్థన్‌రెడ్డికి 1907 ఓట్లు రాగా, భుజంగరావు 1103 ఓట్లు వచ్చాయి. కాసం ప్రభాకర్‌కు 764 ఓట్లు సాధించగా, ఎ.వినయ్‌బాబు 568 ఓట్లు సాధించారు. ఎస్‌ విజయ్‌కుమార్‌ 313 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 212 ఓట్లు , ఎ.సంతోష్‌కుమార్‌ 160 ఓట్లు, అన్వర్‌ఖాన్‌ 142 ఓట్లు, డి.మల్లారెడ్డి 69, ప్రొఫెసర్‌ నథానియ ల్‌ 98, మేడిశెట్టి తిరుపతి 57, జి. వెంకటేశ్వర్లు 47, చంద్రశేఖర్‌రావు 41, పార్వతి 20, కె. సత్తెన్న 6, ఎల్‌ వెంకటేశ్వర్లు 14 ఓట్లు పొందగా, త్రిపురారి అనంతనారాయణ్‌ ఒకే ఓటుతో సరి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు