‘మనాస్లు’ను అధిరోహించిన అన్వితారెడ్డి, దేశంలోనే మొదటి మహిళగా రికార్డు

1 Oct, 2022 12:24 IST|Sakshi

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో రికార్డ్‌ సృష్టించారు. నేపాల్‌లోని ఎత్తయిన మనాస్లు పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణ కోసం ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్‌ నుంచి నేపాల్‌ బయలుదేరి వెళ్లిన అన్వితారెడ్డి... సెప్టెంబర్‌ 11న మనాస్లూ బేస్‌ క్యాంప్‌ చేరుకున్నారు. సముద్రమట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత పైభాగానికి 28వ తేదీ రాత్రి చేరుకొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా అన్వితారెడ్డి చరిత్ర సృస్టించారు. 

మనాస్లు... ప్రపంచంలోనే ఎనిమిదో ఎత్తయిన పర్వతం కావడం విశేషం. ఇప్పటికే పలు పర్వతాలను అధిరోహించిన అన్వితారెడ్డి.. మేలో ఎవరెస్టును, 2021 జనవరిలో ఆఫ్రికాలోని కిలిమంజారోను, ఫిబ్రవరిలో ఖడే, డిసెంబర్‌లో యూరప్‌లోని ఎల్‌బ్రస్‌ పర్వతాలను అధిరోహించారు. భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో అన్వితారెడ్డి పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. పట్టణంలోని పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ దంపతుల కుమార్తె అయిన అన్విత... ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు.

మరిన్ని వార్తలు