పోలీసుల సహకారంతోనే దాడులు: అర్వింద్‌ 

26 Jan, 2022 02:31 IST|Sakshi
చేతులు విరిగిన బీజేపీ కార్యకర్తలను చూపుతున్న ఎంపీ అర్వింద్‌

సాక్షి, నిజామాబాద్‌: పోలీసులు దగ్గరుండి మరీ టీఆర్‌ఎస్‌ శ్రేణులతో దాడులు, హత్యాయత్నాలు చేయిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. తన లోక్‌సభ నియోజకవర్గంలో తాను పర్యటించకుండా టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఇస్సాపల్లిలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి ఘటనపై ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది తమపై రాడ్లు, కత్తులతో దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు.

పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్టు వివరించారు. తర్వాత అర్వింద్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశముందని ఒకరోజు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అయినా టీఆర్‌ఎస్‌ వాళ్లకు పోలీసులే సమాచారమిచ్చి దగ్గరుండి దాడులు చేయించారని ఆరోపించారు. పోలీసులు తమను దారి మళ్లించి, టీఆర్‌ఎస్‌ వాళ్లను పిలిచి దాడి చేయించారని విమర్శించారు. దాడి ఘటన వీడియోల్లో అన్నీ కనిపిస్తున్నాయని చెప్పారు.

దీనిపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇటీవల మాక్లూర్‌ మండలంలో ‘సాక్షి’విలేకరిపై హత్యాయత్నం చేయించారని, ఇప్పుడు తనపైనా హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హుందాగా లేకపోవడం వల్లే టీఆర్‌ఎస్‌ వాళ్లు ఇలా తయారయ్యారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని సవాల్‌ చేశారు.

మరిన్ని వార్తలు