ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అదనపు కలెక్టర్‌.. ప్రశంసించిన హరీశ్‌రావు

4 Oct, 2022 19:06 IST|Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్‌ చేశారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్‌ చేశారు.

ఇలా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 3కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

హరిశ్‌రావు ట్వీట్‌
తెలంగాణ ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయంపై స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‍సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు చాలా మెరగుపడ్డాయని, అందరికీ మొదటి ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇది ఎంతో గర్వించాల్సిన  సమయం అని ట్వీట్ చేశారు.


చదవండి: రాహుల్‌ యాత్ర విచ్ఛిన్నం కోసమే ఈడీ, ఐటీ దాడులు

మరిన్ని వార్తలు