కీలక ఎన్నికలకు కేటీఆర్‌ దూరం: మంత్రులదే బాధ్యత

25 Apr, 2021 04:10 IST|Sakshi

చివరిదాకా మంత్రులదే బాధ్యత

కరోనాతో వరంగల్, ఖమ్మం రోడ్‌షోలకు కేటీఆర్‌ దూరం

మూడు రోజుల్లో ముగియనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

అవసరమైన చోట మరింత మంది మంత్రుల మోహరింపు

కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో సభలు, రోడ్‌షోలకు వెనుకడుగు

ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియనుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార వేడిని పెంచుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 27న ప్రచారం ముగియనుండటంతో ఓటర్లను చేరుకునేందుకు మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఓ వైపు కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు తక్కువ సమయంలో వీలైనంత మంది ఎక్కువ ఓటర్లను కలుసుకోవడం అభ్యర్థులతోపాటు వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న నేతలకు సవాలుగా మారింది. ఓ వైపు వేసవి తీవ్రత, మరోవైపు కరోనా ప్రభావంతో కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం కొనసాగుతోంది. కర్ఫ్యూ నిబంధనల మూలంగా రాత్రి 8 గంటలకే ప్రచారాన్ని ముగించాల్సి రావడం అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది.

రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రచార బృందాలను కలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్న అభ్యర్థులు, నేతలు వీలైనంత మేరకు పాదయాత్ర ద్వారా కాలనీలను చుట్టబెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఊరేగింపులు, పాదయాత్రల్లో పాల్గొనేందుకు జన సమీకరణ కూడా అనుకున్న స్థాయిలో జరగకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్డు, డివిజన్‌ స్థాయిలో పార్టీ యంత్రాంగం మీదే ఆధారపడి ప్రచారం సాగుతోంది. డివిజన్లు, వార్డుల్లో ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించిన టీఆర్‌ఎస్‌ ప్రచారం, పోలింగ్‌ సందర్భంగా సమన్వయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది.

కార్పొరేషన్ల పరిధిలో...
వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూలు సిద్ధం చేశారు. అయితే కరోనా బారిన పడ టంతో ఆయన రోడ్‌షోలను రద్దు చేశారు. సంబంధిత జిల్లా మంత్రులే ప్రచారం చేయడంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే వరంగల్‌ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేస్తూ ప్రచారంలో పాల్గొంటోంది. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో ప్రచారం చేస్తోంది. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌తో పాటు పొత్తుతో మూడు డివిజన్లలో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. హోం మంత్రి మహమూద్‌ అలీ కూడా ఖమ్మంలో ప్రచారం చేస్తున్నారు.

స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి...
సిద్దిపేట సహా మొత్తం 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా 43 వార్డులు ఉన్న సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు పూర్తి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం కావడంతో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ను పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడంలో భాగస్వాములను చేశారు. కొత్తూరులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి ప్రచారం చేస్తున్నారు. అచ్చంపేటలో మంత్రి నిరంజన్‌రెడ్డి.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి ప్రచారంలో పాల్గొంటున్నారు. నకిరేకల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యే లింగయ్యతో కలసి ప్రచారంలో పాల్గొంటున్నారు. జడ్చర్లలో మాజీమంత్రి లక్ష్మారెడ్డికి తోడు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాగా, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు జడ్చర్ల, సిద్దిపేట మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన వారే కావడంతో ప్రచార బాధ్యతలు తీసుకున్న మంత్రులు పార్టీ అభ్యర్థు లకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వరం గల్‌ పరిధిలో 66 డివిజన్లకు 434 మంది బరిలో ఉండ టంతో తక్కువ సమయంలో పార్టీ అభ్యర్థులను ఓటర్లకు చేరువ చేసేందుకు మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరిన్ని వార్తలు