అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ శాఖ నజర్‌.. బీపాస్‌’తప్పనిసరి.. బైపాస్‌ లేదు! 

29 Dec, 2021 12:47 IST|Sakshi

పంచాయతీల్లో ‘జీ+2’ దాటినవన్నీ అక్రమమే

కొత్త పురపాలికల్లోని ఆయా కట్టడాలకు ‘టీఎస్‌–బీపాస్‌’ తప్పనిసరన్న సర్కారు

నూతన మున్సిపల్‌ చట్టం కింద అనుమతి పొందకుంటే కూల్చివేత

పురపాలక శాఖ ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్‌ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త నిర్మాణాలన్నింటికీ ‘టీఎస్‌–బీపాస్‌’ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల అనుమతితో రెండు అంతస్తులకన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉన్న కట్టడాలన్నీ అక్రమమేనని ప్రకటించింది.

2020 నవంబర్‌లోనే టీఎస్‌–బీపాస్‌ విధానం అమలులోకి వచ్చినప్పటికీ కొత్త పురపాలికల్లో గ్రామ పంచాయతీల అనుమతితోనే నిర్మాణాలు జరుగుతున్నట్లు మున్సిపల్‌ శాఖ గుర్తించింది. దీంతో అన్ని నిర్మాణాలకు కొత్త మున్సిపల్‌ చట్టం కింద అనుమతులు పొందాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఉత్తర్వులు (మెమో నంబర్‌ 420) జారీ చేశారు. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అలాంటి భవనాలు నిర్మించిన వారంతా టీఎస్‌–బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్దేశిత రుసుము చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
చదవండి: ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం

గ్రామ పంచాయతీల అనుమతితో బహుళ అంతస్తులు.. 
గ్రామ పంచాయతీ అనుమతితో జీ+2కు మించి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ రెండంతస్తులకు మించి భవనాలు నిర్మించాలంటే హెచ్‌ఎండీఏ లేదా ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. అయినా హైదరాబాద్‌ శివార్లు, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్ల సమీప గ్రామాల్లో పంచాయతీల అనుమతితో రియల్టర్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కళాశాలలు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు తదితర నిర్మాణాలన్నీ గ్రామ పంచాయతీల అనుమతితోనే సాగాయి.

రాష్ట్ర ప్రభుత్వం 2018లో కొత్తగా 61 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటితోపాటు 131 గ్రామ పంచాయతీలను ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీల అనుమతుల పేరుతో కొత్త మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండతో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు సాగినట్లు దుండిగల్‌లోని ఓ రియాల్టీ సంస్థ మోసంతో వెలుగులోకి వచ్చింది.
చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం..భార్యను పట్టించుకోకపోవడంతో..

దీంతో అన్ని కొత్త మున్సిపాలిటీల్లో నిర్మించిన కట్టడాల వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చేసే పనిలో కూడా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అరికట్టకుండా ప్రోత్సహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నిర్మించిన కట్టడాలకు కూడా టీఎస్‌–బీపాస్‌ ద్వారా అనుమతి పొందాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి కోసం ఫీజు చెల్లించినప్పటికీ కొత్తగా అనుమతి రుసుము కట్టాలని, గ్రామ పంచాయతీకి చెల్లించిన మొత్తాన్ని తరువాత సర్దుబాటు చేస్తామని పురపాలక శాఖ డైరెక్టర్‌ తెలిపారు. 

అక్రమ కట్టడాలపై చర్యలకు అదనపు కలెక్టర్‌లకు ఆదేశాలు.. 
నూతన మున్సిపల్‌ చట్టం కింద అనుమతి పొందని నిర్మాణాలను గుర్తించి ఆయా జిల్లాల అదనపు కలెక్టర్‌లు (స్థానిక సంస్థలు) చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా జీ+2కన్నా ఎక్కువ అంతస్తుల్లో జరుగుతున్న నిర్మాణాలపై తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. 
 

మరిన్ని వార్తలు