మన మునుగోడు.. మన కాంగ్రెస్‌ 

12 Aug, 2022 02:08 IST|Sakshi
గురువారం గాంధీ భవన్‌లో సమావేశమైన బోసురాజు, రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌

జనాకర్షక నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని హస్తం పార్టీ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నిక జరిగితే సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజాకర్షక నినాదంతో వెళ్లాలని నిర్ణయించింది. ‘మన మునుగోడు–మన కాంగ్రెస్‌’పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టుమట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మూడంచెల కార్యాచరణను రూపొందించింది. ఈ మేరకు గురువారం గాంధీ భవన్‌లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉపఎన్నికపై చర్చించారు.

ఈ భేటీలో పార్టీ మునుగోడు వ్యూహ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌ కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, నల్లగొండ, భువనగిరి జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు శంకర్‌నాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావెద్, రోహిత్‌ చౌదరి, ఇటీవలే పార్టీలో చేరిన డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ పాల్గొన్నారు. 

కార్యాచరణ ఇలా.. 
ఈ నెల 13 నుంచి 16 వరకు నియోజకవర్గంలో ‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’లు. 13న నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు 13 కి.మీ. నిర్వహించే ఈ యాత్రకు రేవంత్, భట్టి హాజరుకానున్నారు. 

16 నుంచి 19వ తేదీ వరకు మండలస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలి. 16న నాంపల్లి, 17న మర్రిగూడ, 18న చండూరు, 19న మునుగోడులో నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాలకు చెందిన కార్యకర్తలతో భేటీ కావాలి. ఈ సమావేశాల్లో రేవంత్, భట్టి ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ‘మన మునుగోడు–మన కాంగ్రెస్‌’నినాదంతో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో ముఖ్య నాయకులు పర్యటించాలి. 

21న అమిత్‌ షా సభ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా వంటగ్యాస్‌ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించాలి. 

అక్కడ కేఏ పాల్‌.. ఇక్కడ ఆర్‌జీ పాల్‌: రేవంత్‌ 
పార్టీ అనుబంధ సంఘాల సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ అక్కడ కేఏ పాల్‌ ఉంటే... ఇక్కడ ఆర్‌జీ పాల్‌ ఉన్నాడని, ఇక నుంచి రాజగోపాల్‌రెడ్డిని ఆర్‌జీ పాల్‌ అని పిలవాలని ఎద్దేవా చేశారు. పట్టుదలతో పనిచేసి మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించాలని.. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమర్పించిన నిమిషాల వ్యవధిలోనే స్పీకర్‌ ఆమోదించారంటేనే ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని అర్థమవుతోందని అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మధుయాష్కీగౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన పార్టీలో ఉందని చెప్పారు. అయితే అభ్యర్థి ఎవరన్నది సర్వేల ఆధారంగా అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.  

మరిన్ని వార్తలు