TSRTC Buses: ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు

29 Sep, 2021 03:11 IST|Sakshi

జనాన్ని ఆకట్టుకునేందుకు అధికారుల యోచన 

ప్రయోగాత్మకంగా సిటీ బస్సులకు తొలుత మార్పు 

15 ఏళ్లుగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ లుక్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి.ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తోంది.

చాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్‌ తేవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటోంది. కోవిడ్‌తో కునారిల్లి నెలరోజులుగా సిటీ బస్సులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నా.. మరింత పెరగాల్సిందేనన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఉంది. ఇందుకు వాటి రంగులు మార్చడం ద్వారా కొంత ఫలితాన్ని పొందొచ్చని ఆశిస్తున్నారు. 

15 ఏళ్ల తర్వాత.. 
గతంలో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీబస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. డబుల్‌ డెక్కర్‌ బస్సులకు కూడా ఇవే రంగులుండేవి. 15 ఏళ్ల క్రితం దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. అప్పటి వరకు ఎర్ర బస్సు అన్న పేరుతో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. పల్లెలు పచ్చదనంతో మెరిసిపోయే తరుణంలో, బస్సులు కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో రంగులు మార్చారు. అందుకే పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ రంగుతో ఉంటున్నాయి. ఈ సమయంలోనే నగరంలో ఆకుపచ్చ, పెసర రంగు కాంబినేషన్‌లో ఉండే రంగులు కూడా మారి ఎరుపు రంగు వచ్చింది.

దశాబ్దంనరపాటు ఆ రంగు చూసి జనానికి బోర్‌ కొట్టి ఉంటుందన్న భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అందుకోసం జనాన్ని ఆకట్టుకునే రంగుల్లోకి వాటిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. తెలుపు రంగు వెంటనే ఆకర్షిస్తుందన్న ఉద్దేశంతో తెలుపుతో సమ్మిళితమై ఇతర రంగు వేయించాలన్న ఆలోచన ఉండగా, గతంలో బాగా ఆకట్టుకున్న ఆకుపచ్చ–పెసరి రంగును కూడా పరిశీలిస్తున్నారు. ఓ బస్సుకు ఆ రంగు వేయించారు కూడా. మరో ఏడెనిమిది కాంబినేషన్లతో రంగులు వేయించి మెరుగ్గా ఉన్న దాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లా బస్సుల రంగులు కూడా మార్చే అవకాశముంది. 

మరిన్ని వార్తలు