మార్పుకు తగ్గట్టు.. ఉపాధి పెరిగేట్టు

18 Dec, 2021 01:47 IST|Sakshi
కేటీఆర్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం 

కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చిన ఐఎస్‌బీ... ఆన్‌లైన్‌లో 40 గంటల్లోనే పూర్తి 

ఐఎస్‌బీ–సాంకేతిక విద్యామండలి మధ్య ఒప్పందం 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ తర్వాత మారిన మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంట్రపెన్యూర్‌ లిటరసీ అనే కొత్త కోర్సుతో పాటు, బిజినెస్‌ లిటరసీ, బిహేవియరల్‌ స్కిల్స్, డిజిటల్‌ లిటరసీ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఔత్సాహికులు, విద్యార్థులకు ఈ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐఎస్‌బీ, తెలంగాణ సాంకేతిక విద్యామండలి మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం జరిగింది.

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ల సమక్షంలో ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ మదన్‌న్‌పిల్లుట్ల, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా నాలుగు కోర్సులను నిర్వహించనున్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు ఐఎస్‌బీ, సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా సర్టిఫికెట్లను జారీచేస్తాయి. ‘‘కేవలం 40 గంటల వ్యవధి గల ఈ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు.

సొంతంగా సంస్థలను స్థాపించుకునే నైపుణ్యం ఈ కోర్సుల వల్ల వీలుపడుతుంది. కోర్సు పూర్తికాగానే సర్టిఫికెట్‌ జారీచేస్తాం. ఐఎస్‌బీ నిర్వహిస్తున్న కోర్సు కాబట్టి, మార్కెట్లో మంచి విలువ, డిమాండ్‌ ఉంటుంది. కంపెనీలు, పరిశ్రమల తక్షణ అవసరాలను తీర్చగల ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్‌ వంటి కోర్సులను డిజిటల్‌ లిటరసీ కోర్సు ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం.’’ అని నవీన్‌ మిట్టల్‌ అన్నారు.

ఫిబ్రవరి నుంచి కోర్సులు ప్రారంభం  
వచ్చే ఫిబ్రవరి నుంచి ఇవి ప్రారంభమవుతాయి. తాజా ఎంఓయూ ద్వారా 50వేల నుంచి 2లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. కోర్సు మధ్యలో అసెస్‌మెంట్‌ ఉంటుంది. దాని ఆధారం గానే సర్టిఫికెట్లు జారీచేస్తాం. ఫీజులు సైతం తక్కువగానే ఉంటాయి. ఐఎస్‌బీకున్న బ్రాండ్‌ను బట్టి ఈ సర్టిఫికెట్లను ఉద్యోగావకాశాల కోసం వినియోగించుకోవచ్చు.   
– దీపామణి, డిప్యూటీ డీన్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 

మరిన్ని వార్తలు