ఇక కొత్త రోస్టర్‌.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు

4 Oct, 2022 07:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్‌ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గిరిజను లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల శాతానికి తగినట్లుగా గిరిజనుల వాటాను క్రమపద్ధతిలో సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్ల అమలుకు రోస్టర్‌ పాయింట్లే కీలకం.

ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లోకి ప్రవేశాల్లో రోస్టర్‌ ప్రాతిపదికన కేటాయింపులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ప్రతి వందలో 8, 25, 33, 58, 75, 83 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్‌ చేసి ఈ లెక్కన ఉద్యోగ కేటా యింపులు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇస్తూ వచ్చారు. తాజాగా రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతో ఆ మే­రకు ఎస్టీ రిజర్వేషన్‌ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది.

దసరా తర్వాతే స్పష్టత...
గిరిజన రిజర్వేషన్ల పెంపు అమలుకు రోస్టర్‌ సిద్ధం కావాల్సి ఉండటం, ఇందుకు కాస్త సమయం పట్టనుండటం, దసరా సెలవుల అనంతరం రెండో శనివారం, ఆదివారం సెలవు ఉండటంతో కొత్త రోస్టర్‌పై కాస్త సందిగ్ధం నెలకొంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా వరుస సెలవులతో మరో రెండ్రోజులు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో దసరా సెలవుల తర్వాతే నూతన రోస్టర్‌పై స్పష్టత వస్తుందని అధికార వర్గాల సమాచారం. 

ప్రతి పదిలో ఒకటిగా...
ప్రస్తుత రోస్టర్‌ చార్ట్‌లో 6 శాతం ప్రకారం కేటాయించిన స్థానాలతోపాటు అదనపు స్థానాల్లో 4 శాతం కోటాను సర్దుబాటు చేసే అవకాశం లేదు. దీంతో కోటా 6% ఉన్నప్పుడు పోస్టుల మధ్య పాటించిన అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. ఈ క్రమంలో వంద సీట్లలో 10 శాతం కేటాయింపులు జరపాల్సి వస్తే ప్రతి పదిలో ఒకటి చొప్పున స్థానాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగని ప్రతి పదో నంబర్‌ను కేటాయిస్తే దూరం పెరుగుతుందని భావిస్తున్న అధికారులు... ఆ సంఖ్యను కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఉన్న షెడ్యూల్డ్‌ ట్రైబ్‌లకు తాజా రోస్టర్‌ న్యాయబద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ఈ దిశగా రోస్టర్‌ పాయింట్లు సర్దుబాటు చేయాలని, వీలైనంత వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సీఎం ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం.
చదవండి: కాంగ్రెస్‌ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు