-

సచివాలయం శ్వేతసౌధం

22 Aug, 2022 03:05 IST|Sakshi
ధోల్పూర్‌ రంగురాళ్లు అమర్చుతున్న దృశ్యం 

కొత్త సెక్రటేరియట్‌ యావత్తూ తెలుపు రంగే

అలనాటి డంగు సున్నం నిర్మాణ అనుభూతి కలిగించేందుకే..

బేస్‌మెంట్‌ వద్ద 14 అడుగుల ఎత్తుతో ధోల్పూర్‌ ఆగ్రా ఎరుపు రాతి ఫలకాలు

పైభాగంలో జాజు పట్టీ తరహాలో అదే రాతి వరుస

భారీ గుమ్మటం దిగువ భాగంలో లేత గోధుమ రంగురాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కొత్త సచివాలయ భవనం హుస్సేన్‌సాగర తీరాన శ్వేతసౌధంగా మెరిసిపోనుంది. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తులతో పర్షియన్‌ గుమ్మటాల డిజైన్, కాకతీయుల శైలితో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ భవనం యావత్తు తెలుపు రంగులో తళతళలా­డనుంది. ఎన్నో ప్రత్యేకతలతో నిర్మిస్తున్న ఈ భవనానికి రంగుల్లోనూ ప్రత్యేకతలు చూపాలని తొలుత భావించినా భవన ఆర్కిటెక్ట్‌ మాత్రం సంప్రదాయ డంగు సున్నం నిర్మాణపు సొగసు కనిపించాలంటే తెలుపు రంగు మాత్రమే వేయాలని కోరా­రు. ఈ సూచనను ముఖ్యమంత్రి అంగీకరించారు. దీంతో కేవలం తెలుపు రంగుతో ఈ భవనం శ్వేతసౌధంగా ప్రత్యేకతను చాటుకోనుంది.    

నగిషీలు అద్దనున్న ధోల్పూర్‌ రంగురాళ్లు..
భవనమంతా తెల్లగా మెరవనున్నప్పటికీ సున్నపు గోడకు జాజు అద్దినట్టుగా నూతన సచివాల­యానికి రాజస్తాన్‌లోని ధోల్పూర్‌ రంగురాళ్లు నగిషీలద్దనున్నాయి. భవనం దిగువన బేస్‌మెంట్‌ అంతా ధోల్పూర్‌ నుంచి తెప్పించిన ఆగ్రా ఎరుపు రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 14 అడుగుల ఎత్తుతో ఈ రాళ్లను పరుస్తున్నారు. పైభాగంలో జాజు పట్టీ తరహాలో మరో వరుస ఎరుపు రాళ్లు ఏర్పాటు చేశారు.

ఈ భవనానికి ప్రత్యేకంగా నిలవనున్న 82 అడుగుల ఎత్తు, 45 అడుగుల డయాతో రూపుదిద్దుకోనున్న భారీ గుమ్మటం దిగువ భాగమంతా ధోల్పూర్‌ నుంచి తెప్పించిన లేత గోధుమ రంగు (బీజ్‌ý )æ రాళ్లను పరవనున్నా­రు. గుమ్మటం దిగువ నుంచి దానంత వెడల్పుతో బేస్‌మెంట్‌ వరకు ఈ రాళ్లే ఉంటాయి. పెద్ద గుమ్మటాలు సహా మొత్తం 34 గుమ్మటాలు కూడా తెలుపు వర్ణంలో ఉండనున్న సంగతి తెలిసిందే.

3 వేల కి.మీ. నుంచి 500 ట్రక్కుల్లో..
రాజస్తాన్‌లోని ధోల్పూర్‌ గనుల నుంచి ఆగ్రా ఎరుపు, లేత గోధుమ రంగు రాళ్లను ప్రత్యేకంగా తెప్పించారు. పార్లమెంటు సహా రాష్ట్రపతి భవన్‌ లాంటి చారిత్రక నిర్మాణాలకు ఇదే రాయిని వాడారు. ఆ ఠీవీ కనిపించేందుకు సచివాలయానికి కూడా వాటినే ఎంపిక చేశారు. సచివాలయానికి 3 వేల క్యూబిక్‌ మీటర్ల ధోల్పూర్‌ రాళ్లను తెప్పించారు. 3 వేల కి.మీ. దూరంలోని గనుల నుంచి రాళ్లను ఏకంగా 500 కంటైనర్‌ ట్రక్కుల్లో తీసుకురావడం విశేషం.

వాటి కటింగ్‌ కూడా పూర్తి కావడంతో రాళ్లను అమర్చే పని కొనసాగుతోంది. పైభాగంలో పట్టీ తరహాలో కనిపించే అమరిక పూర్తవగా దిగువ బేస్‌మెంట్‌కు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద డోమ్‌ దిగువన లేత గోధుమరంగు రాళ్లను అద్దే పని జరగాల్సి ఉంది. భవనానికి భారీ కిటికీలు ఉండనున్నాయి. వాటి అద్దాలు లేత నీలిరంగులో ఏర్పాటు చేయనుండడంతో, తెలుపు వర్ణం భవనంపై ధోల్పూర్‌ ఎరుపు రాళ్ల వరుస, నీలిరంగు అద్దాలు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. 

మరిన్ని వార్తలు