జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం

29 Aug, 2022 01:34 IST|Sakshi

దసరా ముహూర్తానికి అడ్డొచ్చిన పెద్ద గుమ్మటాల పనులు

అదనంగా మూడు నెలల గడువు కోరిన నిర్మాణ సంస్థ

ఇటీవలి సీఎం సమీక్షలో చర్చ..

తుది నిర్ణయంపై అస్పష్టత ప్రతిష్టాత్మకంగా చేపట్టినా..

వరుస ఆటంకాలతో జాప్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కాబోతోంది. ఈ దసరా నాటికే పూర్తిచేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. పనుల్లో ఆలస్యం వల్ల కుదరని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని నిర్మాణ సంస్థ కోరినట్టు తెలిసింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయ పనులను తనిఖీ చేసిన సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఈ అంశంపై చర్చ జరిగింది.

దసరా నాటికి సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం పేర్కొనగా.. ఆలోగా భవనం పైభాగంలో పలు పనులు పూర్తయ్యేలా లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారని.. దీనిపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దసరా నాటికే పూర్తికావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. తీరు మారకుంటే ఎలాగని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే కేవలం పైభాగంలో కొన్నిపనులే జరగాల్సి ఉన్నందున, దసరా నాటికి కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకోవచ్చని, పైభాగంలో పనులతో పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు సమాచారం. మూడు నెలలు సమయమిస్తే అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా నాటికి భవనాన్ని ప్రారంభిస్తారా, నిర్మాణ సంస్థ కోరిన గడువిచ్చి అన్ని పనులు పూర్తయ్యాకే ప్రారంభిస్తారా అన్నదానిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రధాన గుమ్మటంలో జాప్యంతో!
కొత్త సచివాలయాన్ని ఏడంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిగువ భాగంలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతర్గతంగా తుది పనులు నడుస్తున్నాయి. కొన్ని అంతస్తుల్లో చాంబర్లను కూడా సిద్ధం చేశారు. త్వరలో ఫర్నీచర్‌ కూడా రాబోతోంది. భవనం వెలుపల ధోల్‌పూర్‌ ఆగ్రా ఎర్రరాతిని బేస్‌మెంట్‌గా పరిచే పని జరుగుతోంది. మరోవైపు తలుపులు, కిటికీలు, వాటికి అద్దాలు బిగించే పని కూడా మొదలైంది. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కానున్నాయి. కానీ భవనంపైన ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తున్న పర్షియన్‌ శైలి గుమ్మటం పనులు ఇటీవలే మొదలయ్యాయి. దీన్ని హడావుడిగా నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని.. జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.

వరుస ఆటంకాలతో..
కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు 2021 దసరా నాటికే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వరుస ఆటంకాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. భారీ భవనం అయినందున పునాదులను లోతుగా తవ్వారు. ఈ సమయంలో కఠినమైన రాయి రావడం, కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ చేసి తొలగించాల్సి రావడంతో సమయం వృధా అయింది. తర్వాత కరోనా లాక్‌ డౌన్లతో పనులు ఆగిపోయాయి. కూలీలు తిరిగి వచ్చి పనులు గాడినపడేందుకు నెలల సమయం పట్టింది. రాజస్థాన్‌ ధోల్పూరు గనుల నుంచి ఆగ్రా ఎర్రరాయి, లేత గోధుమ రంగు రాయిని తెప్పించడం కోసం సమయం పట్టింది. వేగంగా పూర్తిచేసేందుకు కూలీల సంఖ్యను రెట్టింపు చేసి.. 2,800 మందిని వినియోగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు