పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా 

26 Oct, 2022 02:24 IST|Sakshi

మిషన్‌ ‘లైఫ్‌’పేరుతో నీతి ఆయోగ్‌ వినూత్న ప్రాజెక్టు 

2022–28 మధ్య కాలంలో 80% ప్రజలు పర్యావరణహితులు కావడమే లక్ష్యం 

విద్యుత్, నీరు పొదుపు.. ప్లాస్టిక్, ఆహార వ్యర్థాల నియంత్రణ దిశగా చర్యలు 

దైనందిన జీవితంలో 75 మార్పులకు సిఫారసు 

మూడు దశల కార్యాచరణ ఈ ఏడాది నుంచే మొదలు 

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్‌ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్‌ లైఫ్‌’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్‌) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది.

మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్‌ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్‌లో మార్పు వస్తుందని వెల్లడించింది. 

దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. 
►ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వాడాలి 
►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి 
►స్నేహితులు, సహచరులతో కార్‌ పూలింగ్‌ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి 
►ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్‌ ఆపేయాలి 
►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్‌ మీద వెళ్లాలి 
►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి 
►పెట్రోల్, డీజిల్‌ వాహనాలకు బదులు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలి 
►వంటలో ప్రెషర్‌ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి 
►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి 
►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి 
►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి 
►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి 
►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి 
►ప్లాస్టిక్‌ సంచులకు బదులు నేత సంచులు వాడాలి 
►వెదురు దువ్వెనలు, వేప బ్రష్‌లు ఉపయోగించాలి 
►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి 
►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి 
►రెండువైపులా ప్రింట్‌ వచ్చేలా ప్రింటర్‌ను సెట్‌ చేసుకోవాలి 
►ఎలక్ట్రానిక్‌ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు.    

మరిన్ని వార్తలు