వ్యాక్సిన్‌ తీసుకుంటేనే జీతం 

7 Dec, 2021 04:27 IST|Sakshi

టెస్కాబ్‌ కీలక నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే డిసెంబర్‌ నెల నుంచి జీతం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) నిర్ణయించింది. ఈ మేరకు టెస్కాబ్‌ ఎం.డి డాక్టర్‌ నేతి మురళీధర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వివిధ దేశాలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే డిసెంబర్‌ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్‌ తీసుకొని సంబంధిత సర్టిఫికెట్‌ సమర్పించాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్‌ తీసుకోవడం వీలుకాని వారు దానికి గల కారణాలు తెలుపుతూ డాక్టర్‌ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. టెస్కాబ్‌లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించామని, అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు