Dharani Portal: అసైన్డ్‌కు ‘ధరణి’ చిక్కులు.. ఆప్షన్లు రాలేదా? మరి ఎలా?

1 Aug, 2021 04:36 IST|Sakshi

పేదల భూములకు ధరణి లావాదేవీలన్నీ బంద్‌.. వారసత్వ హక్కుల బదలాయింపునకు అవాంతరాలు

మార్టిగేజ్‌ ఆప్షన్‌ లేక అవస్థలు.. రికార్డుల్లో తప్పులు సవరించుకునే వీలు లేదు

పాస్‌ పుస్తకాలు లేక రైతు బంధు, బీమాలు బంద్‌ 

క్రమబద్ధీకరణపై ఎటూ తేల్చని ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో అసైన్డ్‌ భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. అసైన్డ్‌ భూములను అమ్ముకునేందుకు, దానం చేసేందుకు వీలు లేని నేపథ్యంలో ఆ మేరకు లావాదేవీలపై మాత్రమే నిషేధం విధించాల్సి ఉండగా ధరణి పోర్టల్‌లో అసైన్డ్‌ భూములకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు బంద్‌ అయ్యాయి. కనీసం అసైనీ చనిపోతే సదరు లబ్ధిదారుని వారసునికి ఆ భూమిపై హక్కులు బదిలీ చేసుకునేందుకు కూడా వీలు లేకుండాపోవడంతో రాష్ట్రంలోని పేద రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయితే, తమ చేతిలో ఏమీ లేదని, సీసీఎల్‌ఏ స్థాయిలో రావాల్సిన ఆప్షన్లు ఇంకా ఇవ్వలేదని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. 

అన్నీ సమస్యలే.. 
వాస్తవానికి, రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు దాదాపు 25 లక్షల ఎకరాలను అసైన్డ్‌ చట్టం కింద పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొన్ని కబ్జాలకు గురికాగా, రైతుల చేతిలో ఉన్న భూములకు కూడా లావాదేవీలు జరగక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి దాదాపు 30 శాతం లబ్ధిదారులకు పాస్‌పుస్తకాలు లేవని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. లబ్ధిదారుల పేర్లు ధరణి పోర్టల్‌లో నమోదయ్యాయి కానీ, పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలకు అవకాశం లేకుండా పోయింది.

పాస్‌పుస్తకాలు లేని కారణంగా పేద రైతాంగానికి ప్రభుత్వం అందజేసే రైతుబంధు రావడం లేదు. ఈ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితి. అసైన్డ్‌ మార్టిగేజ్‌ ఆప్షన్‌ అందుబాటులోకి రాకపోవడంతో కోఆపరేటివ్‌ సొసైటీల్లో తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. వీటికితోడు రికార్డుల్లో తప్పుల సవరణ, మార్పులుచేర్పుల ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 

క్రమబద్ధీకరణ ఎప్పుడో? 
అసైన్డ్‌ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం–1977 ప్రకారమే రాష్ట్రంలోని 6–7 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను అమ్ముకునే వీలుందని భూ చట్టాల నిపుణులు చెపుతున్నారు. ఈ చట్టంలోనే ఆరు రకాల మినహాయింపులు ఇచ్చారని, ఆ భూములను అమ్ముకునే వీలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణపై గతంలో ఆలోచన చేసింది.

అసైన్డ్‌ భూముల్లో ఎంత మేరకు లబ్ధిదారుల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాలు థర్డ్‌ పార్టీల చేతుల్లో ఉన్నాయి? తదితర వివరాలను ఏడాది క్రితమే తెప్పించుకుంది. కానీ, క్రమబద్ధీకరణపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ, నిషేధిత చట్టం వర్తించని భూములను అమ్ముకునే అవకాశం కల్పించడంతోపాటు ధరణి పోర్టల్‌ ద్వారా అసైన్డ్‌ భూముల లావాదేవీలు గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.   

మరిన్ని వార్తలు