ఏపీ రోగులా.. చికిత్స చేయలేం!

20 May, 2021 03:19 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు ఇబ్బందులు

వైద్యం అందించలేమంటున్నకోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సిబ్బంది

 ఆస్పత్రి ఆవరణలోనే బాధితుల పడిగాపులు

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వస్తున్న రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతూ చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న ఏపీ రోగులకు వైద్యం అందడం లేదు. అన్ని రిపోర్టులు తీసుకుని ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు చికిత్స చేయలేమంటూ ఆస్పత్రి సిబ్బంది చేతులెత్తేస్తు న్నారు. బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్న ఇతర రాష్ట్రాల రోగులకు చికిత్స చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని చేర్చుకోవడంలేదు. ఆధార్‌ కార్డు చూసి ఏపీ నుంచి వచ్చిన రోగులైతే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చికిత్స అందిస్తారనే ఆశతో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చికిత్స అందించాలని కోరుతున్నారు. 

ప్రాణాలు పోతున్నా కనికరం లేదు
అన్ని చికిత్సల మాదిరిగా ఇక్కడ బ్లాక్‌ ఫంగస్‌కు కూడా చికిత్స చేస్తారని ఎంతో దూరం నుంచి వచ్చాం. ఆస్పత్రి సిబ్బంది మా ఆధార్‌ కార్డు చూసి చికిత్స చేయడం కుదరదని, వెనక్కి వెళ్లిపోవాలని చెబుతున్నారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా కనికరం చూపడంలేదు.  మా ప్రాణాలను రెండు రాష్ట్రాల సీఎంలు కాపాడాలి. లేకపోతే ఆస్పత్రి ఆవరణలోనే చనిపోతాం.    – దేవమ్మ, ఎలగనూరు, చిత్తూరు

రిపోర్టులన్నీ ఉన్నా చికిత్స చేయడంలేదు..
నాకు కోవిడ్‌ వచ్చి కోలుకున్న తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. దీంతో ప్రైవేటు వైద్యులు కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. రిపోర్టులతో ఇక్కడకు వస్తే ఏపీకి చెందినవారికి ఇక్కడ వైద్యం చేయబోమని సిబ్బంది చెబుతున్నారు. చికిత్స ఆలస్యమై ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఫంగస్‌తో ఇప్పటికే ఎంతో ప్రాణభయంతో ఉన్నాం. ఈ విషయంపై ఇక్కడి ప్రభుత్వం తక్షణమే స్పందించి.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా చికిత్స చేయడానికి అనుమతి ఇవ్వాలి.    – సురేశ్‌ బాబు, తిరుపతి

పడకలు లేనందువల్లే.. 
ఆస్పత్రిలో 50 పడకలు ఏర్పాటు చేయగా, అన్నీ నిండిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి వస్తున్న కొత్త కేసులను కూడా చేర్చుకునే పరిస్థితి లేదు. గురువారం పడకల పెం పు అంశాన్ని పరిశీలిస్తాం. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్లాక్‌ ఫంగస్‌ నోడల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రోగులు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడం వల్లే కొత్తగా వచ్చిన వారికి చేర్చుకోలేకపోతున్నాం. ఆస్పత్రి నుంచి గెంటివేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదు.
–డాక్టర్‌ టి.శంకర్, సూపరింటెండెంట్,కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి

మరిన్ని వార్తలు