టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.2.2 లక్షల కోట్లు పెట్టుబడులు

1 Aug, 2021 04:05 IST|Sakshi

పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి కేటీఆర్‌

పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌

పరిశ్రమల స్థాపనకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ

రంగారెడ్డి జిల్లా మేకగూడలో పోకర్ణ క్వార్జ్‌ పరిశ్రమ ప్రారంభం

సాక్షి, నందిగామ: పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. 2015 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేసి క్వాంట్రా క్వార్జ్‌ (గ్రానైట్‌) పరిశ్రమను శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నం దునే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని, ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2015 నవంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనేది పాలసీ ఉద్దేశమని స్పష్టం చేశారు.

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమను స్థాపించాలనుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. పోకర్ణ కంపెనీ రూ.500 కోట్లతో ఈ పరిశ్రమను స్థాపించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ పరిశ్రమతో సుమారు 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. పరిశ్రమల స్థాపనకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తామని ఆయన అన్నారు.

అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సుమారు 500 ఎకరాల్లో రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ ఎండీ గౌతం చంద్‌ జైన్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్‌ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు