వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!

9 Mar, 2022 19:11 IST|Sakshi
హోల్‌సేల్‌ డీలర్ల వద్ద నిల్వ ఉన్న నూనె డబ్బాలు

మిర్యాలగూడ: నిత్యావసర ధరలు పెరగడంతో ఇప్పటిటే సామాన్యులు అల్లాడుతండగా.. మూలిగే నక్కపై తాటిపడ్డ చందంగా వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ధరలు లీటరుపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి అయ్యే సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి కాకపోవడంతో పామాయిల్‌కు డిమాండ్‌ పెరిగింది.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో పామాయిల్‌ వాడకం ఎక్కువ కావడంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో వంటనూనెను కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులే కావాలని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తగ్గిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి
వంట నూనె ధరల పెరుగుదలకు ఉక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్ధమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లో 80 శాతం వరకు సన్‌ఫ్లవర్‌ సాగుచేస్తారు. రష్యాలో కూడా ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. ఆ రెండు దేశాల నుంచి భారత్‌ సన్‌çఫ్లవర్‌ దిగుమతి చేసుకుంటుంది. భారత్‌ ఏటా 3లక్షల టన్నుల నూనెను దిగుమతి చేసుకోగా యుద్దం కారణంగా ప్రస్తుతం 1.40లక్షల టన్నులకు తగ్గింది. ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమ తి చేసుకునే పామాయిల్‌ వినియోగం పెరగడంతో పామాయిల్‌ ధర కూడా అమాంతం పెరిగింది. అంతేకాకుండా త్వరలోనే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కృత్రిమ కొరత సృష్టించారు
ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాకుగా చూపించి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెల ధరలను విపరీతంగా పెంచుతున్నారు. అధి కారులు స్పందించి దుకాణాలపై దాడులు చేసి ధరలు పెంచి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
– కోల ఉమాశ్రీ, మిర్యాలగూడ

దిగుమతి అంతరాయంతోధరలు పెరిగాయి
ఉక్రెయిన్, ఇండోనేషియా నుంచి వంట నూనెలు దిగుమతి అవుతాయి. దిగుమతి అంతరాయం వల్లే కంపెనీ నిర్వాహకులు ధరలు పెంచారు. స్టాక్‌ పెట్టేందుకు అవకాశం లేదు. వచ్చినది వచ్చినట్లుగానే వినియోగదారులకు అందించేందుకు నా వంతు కృషిచేస్తా.       
– చల్లా భాస్కర్, వంట నూనెల హోల్‌సేల్‌ డీలర్‌ 

మరిన్ని వార్తలు