తెలంగాణలో ప్రగతి పరుగులు.. నీతి ఆయోగ్‌ ‘అర్థ్‌నీతి’ నివేదిక

1 Sep, 2021 03:58 IST|Sakshi

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి 

జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రం 

ఆవిర్భావం నుంచి సగటున 9% కంటే ఎక్కువగా వార్షిక వృద్ధిరేటు 

సేవారంగం వాటా 60% కంటే ఎక్కువ 

నీతి ఆయోగ్‌ ‘అర్థ్‌నీతి’ నివేదిక విశ్లేషణ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్‌ విశ్లేషించింది. జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రమని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు, దేశ ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్‌ ‘అర్థ్‌నీతి–వాల్యూమ్‌’ 7ను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. ‘జీఎస్‌డీపీ పరంగా తెలంగాణ ఏడో పెద్ద రాష్ట్రం. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది’ అని పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సగటున వార్షిక వృద్ధి 9 శాతం కంటే ఎక్కువగా ఉందని, ఇది రాష్ట్ర ఆవిర్భావం ముందు కంటే ఎక్కువ అని పేర్కొంది.  
(చదవండి: Desi Apple: డిమాండ్‌ ఎక్కువ.. ధర తక్కువ!)

రాష్ట్ర దేశీయోత్పత్తి(ఎస్‌డీపీ)లో సేవా రంగం వాటా 60 శాతంగా ఉందని వివరించింది. అయితే ఉపాధి విషయంలో వ్యవసాయ రంగం గణనీయమైన వాటా కలిగి ఉందని, మొత్తం జనాభాలో 54 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారని వివరించింది. ఎస్‌డీపీలో వ్యవసాయ రంగ వాటా 16 శాతమని, 86 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులేనంది.  రాష్ట్ర దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 17 శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ తదితర హైటెక్‌ రంగాలు, టెక్స్‌టైల్స్, లెదర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, మినరల్స్‌ వంటి సంప్రదాయ రంగాల మిశ్రమంగా ఉందని విశ్లేషించింది.

2020, అక్టోబర్‌ నాటికి రాష్ట్రంలో 153 ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌) ఉండగా, వీటిలో 34 కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, 56 నోటిఫై అయ్యాయని, 63 అనుమతులు పొంది ఉన్నాయని వివరించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 2020లో ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ పాలసీని ఆవిష్కరించిందని, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌కు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.  

 ఫార్మా రంగంలో నేషనల్‌ లీడర్‌... 
ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో తెలంగాణను నేషనల్‌ లీడర్‌గా నీతిఆయోగ్‌ అభివర్ణించింది. 2019–20లో 4.63 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసిందని పేర్కొంది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్‌ వాటా 20 శాతంగా ఉందని చెప్పింది. హైదరాబాద్‌ను ఫార్మా సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఈ ఫార్మాసిటీని సుస్థిర పారిశ్రామిక నగరానికి అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌గా ఏర్పాటు చేయనుందని వివరించింది. 

ఐటీలో స్థిరమైన వృద్ధి... 
తెలంగాణలో ఐటీ రంగం స్థిరమైన వృద్ధి రేటు కనబరుస్తోందని అర్థ్‌నీతి విశ్లేషించింది. ఐటీ రంగంలోనూ తెలంగాణ అగ్రశ్రేణిలో నిలిచిన రాష్ట్రమని, గడిచిన కొన్నేళ్లలో ఐటీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌(ఐటీఈఎస్‌) ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి రేటు కనబరిచిందని తెలిపింది. ఇటీవలే ప్రకటించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌) రానున్న ఐదేళ్లలో ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 53 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు కానుందని వివరించింది. 

కేంద్ర పన్నుల వాటాలో 6% తగ్గుదల
2019–20 ఆర్థిక సంవత్సర వాస్తవిక వ్యయంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13% అధికంగా రాష్ట్రం వ్యయం చేయనుందని, ఇదే కాలంలో రాష్ట్ర రెవెన్యూలో 31% వార్షిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,990 కోట్లుగా ఉంటుందని, ఇది 2019–20తో పోల్చితే 6 శాతం తగ్గుదలను సూచిస్తోందని తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ద్రవ్య లోటు లక్ష్యాలను అమలు చేయడం ద్వారా ప్రస్తుతం జీఎస్‌డీపీలో 29.5 శాతంగా ఉన్న అప్పులు.. 2025–26 నాటికి 29 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2021–26 మధ్య కాలంలో రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు 0.86% వాటా ఉందని, అంటే ప్రతి వంద రూపాయల్లో 86 పైసలు తెలంగాణకు వస్తాయని విశ్లేషించింది. 
(చదవండి: కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష! )

విస్తృతంగా మౌలిక వసతులు 
తెలంగాణలో అద్భుత రహదారులు, రైల్వే సౌకర్యం ఉందని, రాష్ట్రం గుండా 2,592 కి.మీ. పొడవైన 16 జాతీయ రహదారులు వెళ్తున్నాయని విశ్లేషించింది. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో ఇది 10% అని తెలిపింది. 200లకుపైగా రైల్వేస్టేషన్లు దేశంలోని ఇతర నగరాలతో అనుసంధానమై ఉన్నాయని వివరించింది. 2021, ఫిబ్రవరి నాటికి 16,931 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిఉందని విశ్లేషించింది. మైస్‌ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్‌) టూరిజానికి హైదరాబాద్‌ ప్రముఖ ప్రాంతమని, గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ సహా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిందని వివరించింది. అలాగే మెడికల్‌ టూరిజంలో హైదరాబాద్‌ మేజర్‌ సిటీగా అభివృద్ధి చెందిందని, తెలంగాణలోని పలు ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొంది. 2018లో 9.28 మంది దేశీయ పర్యాటకులు, 3.2 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని తెలిపింది.  

మరిన్ని వార్తలు