-

కేంద్ర గెజిట్‌ను అడ్డుకుందాం

10 Oct, 2021 02:28 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ. కోదండరామ్‌

సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్‌): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్‌ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు.

అందుకే కేంద్ర గెజిట్‌ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు.

కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్‌ ఇంజనీర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు