టీఆర్‌ఎస్‌లో చేరికలు.. నిష్క్రమణలు! 

23 May, 2022 00:27 IST|Sakshi

నల్లాల ఓదెలు దంపతుల బాటలో మరికొందరు నేతలు? 

పార్టీని వీడినవారిలో కొందరు సొంతగూటికి చేరే యోచన 

బహుళ నాయకత్వం ఉన్న చోట నేతల నడుమ ఆధిపత్య పోరు 

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా దక్కని పదవులు 

ఎన్నికల నాటికి సొంతదారి వెతుక్కునే పనిలో అసంతృప్తులు 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచి పలు పార్టీలోంచి వలసలను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ వస్తోంది. దీంతో గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వరకు అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌లో బహుళ నాయకత్వం తయారైంది.

కొన్నిచోట్ల నేతలు సర్దుబాటు చేసుకుని పనిచేస్తుండగా, చాలాచోట్ల ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ పోరు కొన్నిచోట్ల అంతర్గతంగా, తాండూరు, కొల్లాపూర్‌ వంటి నియోజకవర్గాల్లో బహిర్గతంగా జరుగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 103 చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలదే పైచేయిగా సాగుతోంది.

గతంలో ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆధిపత్యపోరులో పైచేయి సాధించలేక, ఇటు సొంత రాజకీయ అస్తిత్వాన్ని వదులుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయపరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఉద్యమ సమయం నుంచీ గుర్తింపు దక్కడం లేదని భావిస్తున్న నేతలు కూడా వచ్చే ఎన్నికలనాటికి సొంతదారి చూసుకోవాలనే యోచనలో ఉన్నారు.  

నల్లాల ఓదెలు బాటలో మరికొందరు 
ఉద్యమ సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకుని మూడు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది. ఆ తర్వాత ఆయన భార్య భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో అధిపత్యపోరు సాగుతుండటంతో రెండురోజుల క్రితం అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు.

గతేడాది మాజీమంత్రి ఈటల రాజేందర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తులా ఉమ తదితరులు పార్టీని వీడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌(ఆలేరు) బీజేపీలో చేరగా పార్టీ కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ పార్టీకి దూరమయ్యారు.

అయితే కొద్దినెలల వ్యవధిలోనే రవీందర్‌సింగ్‌ తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. వచ్చే ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు ఉండటంతో మాజీమంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కోవా లక్ష్మి, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎటువైపు అడుగులు వేస్తారనే చర్చ జరుగుతోంది.

40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకుంటారనే ప్రచారం సాగుతోంది. ‘టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ సాగిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న నల్లాల ఓదెలు, బాబూమోహన్, చింతల కనకారెడ్డి, కొండా సురేఖ, సంజీవరావు, బొడిగె శోభకు టికెట్‌ నిరాకరించి కొత్తవారికి అవకాశం కల్పించారు.

అదే తరహాలో వచ్చే ఎన్నికల్లోనూ సుమారు 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో పార్టీలోని గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తారు. అవసరమైతే ఇతర పార్టీల్లో ఉన్న గెలుపు గుర్రాలను కూడా పార్టీ లోకి రప్పించి టికెట్‌ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను కూడా అవసరాన్ని బట్టి తిరిగి చేర్చుకునే అంశాన్ని కేసీఆర్‌ పరిశీలిస్తారు. చాలా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు నామమాత్ర పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ లేకపోవడంతో టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు, అవకాశం దక్కని వారిపై ఆ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి’అని పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నేత వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు