ఐదు రోజులుగా ఇలాగే.. కొంటారా? కొనరా?

21 May, 2021 12:55 IST|Sakshi

అయితే ధాన్యం కొనుగోలు కేంద్రంలో.. లేదంటే రోడ్డుపై.. ఎక్కడైనా రైతులకు పడిగాపులు తప్పట్లేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాల సమీపంలోని వరంగల్‌ – ఖమ్మం హైవేపై ఐదురోజులుగా కిలోమీటర్‌ మేర నిలిచిపోయిన ధాన్యం లోడు ట్రాక్టర్లివి. అక్కడి హరిచందన రైస్‌మిల్లు యజమానులతో పాటు అధికారులను ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయాలని రైతులు కోరుతున్నా స్పందన లేదు.     – స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, వరంగల్‌ అర్బన్‌


కొంటారా? కొనరా?

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ధాన్యాన్ని కాంటా పెట్టించుకున్న రైతులు.. 20 రోజులుగా లారీల కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు తడిసిన ధాన్యం కొనాలంటూ.. బస్తాల్ని ప్రధాన రహదారిపైకి చేర్చి ఆందోళనకు దిగారు. అంతకుముందు ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు.     – మహబూబాబాద్‌ 


రూ.2 లక్షల నష్టం

నీళ్లుతోడుతూ వడ్లగింజల్ని ఒడిసిపట్టే యత్నంలో ఉన్న ఈ రైతు పేరు మారబోయిన స్వామి (చీటకోడూరు). స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 250 బస్తాల ధాన్యం తెచ్చాడు. బుధవారం అర్ధరాత్రి వర్షానికి 150 బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మరికొన్ని కొట్టుకుపోయాయి. ఈ ఒక్క రైతే రూ.2 లక్షల మేర నష్టపోయాడు. ఈ మార్కెట్లో పలువురు రైతులకు చెందిన పదివేలకు పైగా బస్తాల ధాన్యం వర్షాలకు దెబ్బతింది.     – జనగామ


ధాన్యం.. మొలకెత్తిన దైన్యం

చేతికొచ్చిన పంట చెదలుపడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టార్జితం నీళ్లపాలై మొలకలెత్తుతోంది. ఈ ఫొటోలోని రైతు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాలగూడెంకు చెందిన బడేటి పుల్లయ్య. నెలన్నర క్రితం స్థానిక కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్లాడు. ఇన్నాళ్లూ కాంటా కూడా వేయలేదు. అప్పట్నుంచి పట్టాలు కప్పి ధాన్యాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నా.. అడపాదడపా పడిన అకాల వర్షాలు అతని శ్రమను తుడిచిపెట్టేశాయి. ఫలితంగా ధాన్యం ఇలా మొలకలెత్తింది. మరికొంత ధాన్యం బూజుపట్టిపోయింది.
– కూసుమంచి 

చదవండి:
బండెనక బండి.. ధాన్యం లెండి

ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు