ఈసారీ మంచి వానలు

14 Apr, 2021 04:01 IST|Sakshi

పంటలు బాగా పండి రైతు మొహంలో చిరునవ్వు

మహిళల ఆధిపత్యం పెరుగుతుంది

​కేంద్ర-రాష్ట్రాలు, ప్రభుత్వం-ప్రజల మధ్య సమన్వయం

మే తర్వాత కోవిడ్‌ తగ్గుముఖం

ఉగాది పంచాంగ పఠనంలో బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి

దేవాదాయ శాఖ కమిషనరేట్‌లో నిరాడంబరంగా వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌:  ప్లవ నామ సంవత్సరంలో మంచి వానలు కురుస్తాయని, రైతుల మోములో చిరునవ్వు వస్తుందని శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణి కులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి చెప్పారు. కొత్త ఏడాది మహిళల ఆధిపత్యం అన్ని రంగాల్లో విస్తరిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం–ప్రజల మధ్య సమన్వయం, సఖ్యత వల్ల పాలన సాఫీ సాగుతూ ప్రజలకు మేలు జరుగుతుం దని వివరించారు.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ‘ప్లవ’నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..‘‘ప్లవ అంటే పడవ. నీటి పక్షి అన్న అర్థం కూడా ఉంది. అగ్ని పురాణం ప్రకారం.. ఇప్పుడు ముగిసిన సంవత్సరం శార్వరి. శార్వతి అంటే చీకటి రాత్రి.. వచ్చే సంవత్సరం శుభకృతి అంటే శుభం.

చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేదే ప్లవ నామ సంవత్సరం. ఈ ఏడాది పర్వతాకారం లాంటి నల్లని మేఘాలతో ఆకాశం ఆవృతమై ఉంటుంది. రాజు- ప్రజలు సమైక్యంగా జగతికి కాంతులనిస్తా రని శాస్త్రం చెబుతోంది. ధనధాన్యాల వృద్ధి అద్భు తంగా ఉంటుంది. వర్షాలు కురుస్తాయి, పంటలు పండేందుకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. విశేష శుభ ఫలితాలను పొందుతాం.

ఈ సంవత్సరానికి దైవం రుద్రుడు. అందువల్ల ఈశ్వరారాధన శుభాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురువు, అర్ఘాధిపతి, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. కుజుడికి ఆధిపత్యం రావటం, మేష లగ్నంలో సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు– ప్రభుత్వానికి మధ్య సానుకూలాంశాలు నెలకొంటాయి.
సమర్థ పాలన
మన రాష్ట్రాధిపతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకరీత్యా బుధ మహాదశలో పుట్టారు. ఆయనది మేష లగ్నం. ఆయన గ్రహస్థితిలో అద్భుతంగా యోగించిన కుజుడు ఈ సంవత్సరం రాజు కావడం.. ఈ పోలికల ఆధారంగా పంచాంగాన్ని విశ్లేషిస్తే.. సమర్థవంతమైన పాలన సాగుతుంది. శనికుజుల పరస్పర వీక్షణం వల్ల ముఖ్యమంత్రి వేగాన్ని మిగతా మంత్రులు, అధికారులు అందుకోలేకపోవచ్చు. దీనివల్ల సమన్వయ లోపం కొంత ఏర్పడి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

ఖర్చులు పెరుగుతాయి 
వ్యయస్థానంలో రవి బుధ చంద్రుల కలయిక వల్ల పాలనాపరమైన ఖర్చులు  పెరుగుతాయి. ప్రజలు ఆడంబరాలకు పోయి స్థాయికి మించిన ఖర్చు చేస్తారు. అందుకే ప్లవ నామ సంవత్సరంలో ప్రజలు దుబారా, ఆడంబరాలను తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. రక్షణ శాఖ ఉత్సాహంగా పనిచేస్తుంది, కొత్త ఆయుధాల ఆవిష్కరణ జరుగుతుంది. 
ప్రభుత్వానికి ప్రజల అండ
ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉండదు. ప్రభుత్వానికి ప్రజల అండదండలు మెండుగా ఉంటాయి. రాజ్యాంగ నిర్ణయాలు ప్రజలకు సంతృప్తినిస్తాయి. ప్రస్తుత గ్రహస్థితి వల్ల జూలై 13 నుంచి ఆగస్టు 16 మధ్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మే తర్వాత కరోనా ఉధృతి బాగా తగ్గుతుంది. కానీ ప్రజలు నిర్లక్ష్యాన్ని వదిలేయాలి. సెప్టెంబరు 14 నుంచి నవంబరు 20 మధ్య గురు శనిల కలయిక వల్ల మరోసారి భయాందోళన పరిస్థితి నెలకొంటుంది. డిసెంబరు 4 నుంచి కాలసర్పదోషం వల్ల కొన్ని అరిష్టాలు ఏర్పడుతాయి. మకర రాశిలో శనైశ్వర సంచారంతో భయం, అతివృష్టి ఏర్పడతాయి. 2022 మార్చి మొదటివారంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తలు అవసరం. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష పురోగతి ఉంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ పురోగమిస్తుంది 
కుజుడికి చాలా ఆధిపత్యాలు రావటంతో రియల్‌ ఎస్టేట్‌లో భారీ పురోగతి ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి. 3,4 రియల్‌ ఎస్టేట్‌ సంబంధిత భూ కుంభకోణాలు వెలుగుచూస్తాయి. ప్రజలు భూములు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఏడాది సింధూ పుష్కరాలు 
నవంబర్‌ 21 నుంచి డిసెంబరు 2 వరకు సింధూ నది పుష్కరాలు ఉంటాయి. మనదేశంలో తక్కువ ప్రాంతంలో ఆ నది ఉన్నందున సింధూ నదిని తలుచుకుని మిగతా నదుల్లో స్నానం చేస్తే పుష్కర పుణ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం మనకు గ్రహణ ప్రభావాలు లేవు.

ఈసారి ముహూర్తాలు ఎక్కువ 
గతేడాది మౌఢ్యముల వల్ల ముహూర్తాలు తక్కువగా ఉండటంతో జనం ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా పెళ్లిళ్లు జరుగుతాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాలసర్పదోషం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఆధ్యాత్మిక భావనతో గడిపితే మంచి జరుగుతుంది. కాళేశ్వరం పరిపూర్ణంగా నిండి జలవనరులతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. యాదాద్రి దేవాలయం ప్రారంభమై దివ్యమంగళ దర్శనం కలుగుతుంది.’’

 

మరిన్ని వార్తలు