మాకొద్దు బాబోయ్‌ ఈ ‘కొలువు’!

10 Feb, 2021 14:35 IST|Sakshi
ఘట్‌కేసర్‌ మండలం మర్పల్లిగూడ పంచాయతీ కార్యాలయం

రాజీనామా బాటలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

గతేడాది 20 మంది చేరిక

ఇప్పటివరకు 9 మంది రాజీనామా 

సాక్షి, ఘట్‌కేసర్ ‌: వారంతా అర్ధాకలితో నిరుద్యోగ బాధను దిగమింగుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించి చదువుకున్నారు. పేదరికం విలువ తెలుసుకొని పోటీ పరీక్షలకు సమయత్తమై విజేతలుగా నిలిచి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం సాధించారు. కటిక పేదరికాన్ని అనుభవించి ఉద్యోగం రావడంతో ఉప్పొంగిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి చదివించిన తల్లితండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుదామని అనుకున్నారు.

ఏడాది పాటు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఆ తర్వాతే తెలుసుకున్నారు జీవితంలో అసలు పరీక్ష ప్రారంభమైందని. పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగమిచ్చినా.. సర్కారు శిక్షణ ఇవ్వకుండానే ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంతో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని భారం పెరగడం, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని భరించలేకపోయారు. అప్పటి వరకు పేదరికాన్ని చవిచూసిన ఆ ఉద్యోగులు కుటుంబానికి అన్నం పెట్టే ఉద్యోగానికే రాజీనామ చేశారు. 2019 సంవత్సరంలో జిల్లాలో 20 మంది జూనియర్‌ కార్యదర్శలుగా ఉద్యోగంలో చేరగా 9 మంది రాజీనామా చేశారు. 
చదవండి: కూకట్‌పల్లిలో బయటపడ్డ ఫేక్‌ డాక్టర్‌ మోసం!
కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు

ఒత్తిడి భరించలేక... 
నియామక సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో శిక్షణ లేకుండానే ఉద్యోగంలో చేరారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమం వారికి దిమ్మదిరిగేలా చేసింది. ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లతో పాటు ఉపాధి హామీ పనులు, హరితహారం, పల్లె ప్రగతి, వైకుంఠ ధామం, డంపింగ్‌ యార్డు షెడ్ల పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్పొరేట్‌ స్కూల్లో చదవడంతో గ్రామ కంఠం భూమి అంటేనే వారికి తెలియదు. అలాంటిది సర్పంచ్, ఉప సర్పంచులకు మధ్యన పొసగక పోవడం, ఓడిన, గెలిచిన వారు రెండు వర్గాలుగా చీలి అభివృద్ధి పనులు ఆపడం, కొత్తగా వచ్చిన జూనియర్‌ కార్యదర్శులకు మేజర్‌ పంచాయతీలు అప్పగించడం, డీపీఓ ఆఫీస్‌ నుంచి ఉదయం 8 గంటలకే వీడియో కాల్‌ రావడం తల నొప్పిగా మారింది. 

ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన వాళ్లు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగడం, నిధులు లేకున్నా పనులు చేయాలని మెడమీద కత్తిపెట్టడం, లేదంటే షోకాజ్‌ నోటీసులివ్వడం వారిని మరింత కుంగదీసింది. ఎగ్జిక్యూటివ్‌ పదవి కార్యదర్శి ఉద్యోగం వదిలి చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోయారు. ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టిసారించి ప్రస్తుతం అమలు చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రదు చేసి నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్‌ కార్యదర్శుల నియామకాలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

సవాలక్ష ఆంక్షలతో ఎలా... 
ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. జూనియర్‌ కార్యదర్శులుగా అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి నోటిఫికేషన్‌ ద్వారా నియామకాలను చేపట్టాలి. 
– బద్దం మిత్రారెడ్డి, నిరుద్యోగి, ఘనాపూర్‌ 

మరిన్ని వార్తలు