వామ్మో ఆ యాప్‌.. మెడ మీద కత్తిరా బాబోయ్‌!

27 Sep, 2021 10:24 IST|Sakshi

పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందికరంగా డీఎస్‌ఆర్‌ యాప్‌

ఇప్పటికే అదనపు భారం.. ఆపై యాప్‌ గోల

ఉదయం 5 గంటలకు హాజరు నమోదు చేయాల్సిందే..

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నేటి నుంచి నూతన వెర్షన్‌ అమల్లోకి తేవాలని ఆదేశాలు

ససేమిరా అంటున్న సెక్రెటరీల

సాక్షి,కెరమెరి(ఆసిఫాబాద్‌): గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నూతనంగా తీసుకొచ్చిన డీఎస్‌ఆర్‌(డైలీ శానిటేషన్‌ రిపోర్టు) యాప్‌ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే అదనపు భారం మోస్తున్న తమకు ఈ యాప్‌ మెడ మీద కత్తిలా ఉందని కార్యదర్శులు వాపోతున్నారు.  గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యంతో సహా పల్లె ప్రగతి పనుల పురోగతి నమోదు కోసం ప్రభుత్వం డీఎస్‌ఆర్‌ యాప్‌ తీసుకొచ్చింది.

పల్లె ప్రగతి పనులు పరిశీలన, వీధుల శుభ్రం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్‌ బిల్లులు ఇలా ప్రతి సమాచారాన్ని ప్రస్తుత డీఎస్‌ఆర్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఈ యాప్‌ను మార్చారు. కొత్త ఆప్షన్‌లను ఇందులో చేర్చారు. కొత్త డీఎస్‌ఆర్‌ ఆప్‌ను ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కాని చాలా మంది ఇంకా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోలేదు. దీన్ని వినియోగించడానికి నిరాకరిస్తున్నారు. నేటి నుంచి దీన్ని వాడకంలోకి తేవాలని కోరుతుండగా, కొద్ది మంది మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏంటి ఇది..
పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఉన్న యాప్‌ను తొలగించి కొత్తది ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇందులో పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి అనుసంధానం చేయాలి. ఇది ఈ కార్యాలయ, ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రోడ్లు వీధులు, తదితర ఐదు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. పాత తేదీని తీసిన ఫొటో అయితే అప్‌లోడ్‌ కాదు.

పంచాయతీ కార్యదర్శులు ఖచ్చితంగా లోకేషన్‌లో ఉండి పనిచేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇది ప్రధానంగా ఇబ్బందికి కారణం. దీని ప్రకారం కార్యదర్శులు తప్పక ఉదయం 5 గంటలలోపు హాజరును యాప్‌లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా తెరచుకోదు. స్వీయా చిత్రం తీసుకుంటేనే హాజరు నమోదవుతుంది. తర్వాత డైయిలీ శానిటేషన్‌ రిపోర్టును ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అదనపు పనిభారంతో సతమతమవుతున్న తమకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు.

సిగ్నల్స్‌ రాని వారి పరిస్థితి?
కొత్త విధానంతో కార్యదర్శులు సంకట స్థితిలో పడ్డారు. కార్యదర్శులు అందరూ స్థానికంగా నివాసం ఉండడం లేదు. నివాసిత ప్రాంతానికి దూరంగా ఉన్నా పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము లేచి బయలుదేరితే తప్పా 5 గంటల్లోపు కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇక మహిళా కార్యదర్శులు ఇక్కట్లకు గురికావాల్సిందే. వేళాపాళా లేకుండా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి రావడంతో లోలోనా కుమిలిపోతున్నారు. జిల్లాలో సెల్‌ఫోన్‌ సంకేతాలు సరిగా అందని పంచాయతీలు దాదాపు 200 వరకూ ఉన్నాయి.

అక్కడ ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ విధానం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.కొత్తయాప్‌ను మెడ మీద కతిక్తలాంటిదని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు పనులు తామే చేస్తున్నామని, పాఠశాలల్లో స్వీపర్లను తొలగించడంతో తమ సిబ్బంది ద్వారా పనిచేయించాల్సి వస్తుందని అంటున్నారు. ఊర్లో అన్ని సమస్యలు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. నాయకులు, పై స్థాయి అధికారులు వచ్చినా ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌లో పేర్కొన్న నిబంధనలు మార్చాలని విన్నవిస్తున్నారు. 

చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే..

మరిన్ని వార్తలు