కాశీకి పోలేము రామాహరి!

16 Oct, 2022 00:38 IST|Sakshi

రెండు నెలల ముందు టికెట్‌ బుక్‌ చేసుకున్నా సీటు కన్ఫర్మ్‌ కష్టమే 

హైదరాబాద్‌ నుంచి నడుస్తున్నది ఒక్క రైలు మాత్రమే 

భక్తులతోపాటు ఉత్తరాదికి వెళ్లే ఇతర ప్రయాణికులూ అందులోనే 

గతంలో రద్దీకి వీలుగా అరగంట తేడాతో క్లోన్‌ రైలు 

కోవిడ్‌ సమయంలో రద్దు చేసి.. మళ్లీ పునరుద్ధరించని రైల్వే 

సాక్షి, హైదరాబాద్‌:  జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లిరావాలని చాలా మంది పెద్దల కోరిక. అంతదూరం ప్రయాణించాల్సి రావడంతో.. కాశీకి వెళితే కాటికి వెళ్లినట్టే అన్న సామెత కూడా పుట్టింది. ఇప్పుడు ఇంతగా ప్రయాణ సౌకర్యాలు పెరిగినా మన రాష్ట్రవాసులకు మాత్రం కాశీ యాత్ర కష్టాలు మాత్రం తప్పడం లేదు. అంత దూరం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించలేక, విమాన ప్రయాణ ఖర్చులు భరించలేక.. రైళ్లను ఆశ్రయించే భక్తులు తిప్పలు పడుతున్నారు.

రెండు నెలల ముందు రిజర్వేషన్‌ కోసం బుక్‌ చేసుకున్నా వెయిటింగ్‌ లిస్టే ఉంటూ.. సగం మందికి కూడా సీట్లు మాత్రం కన్ఫర్మ్‌ కావడం లేదు. హైదరాబాద్‌ నుంచి రోజూ ఒక్క రైలు మాత్రమే ఉండటం దీనికి కారణం. అంతేకాదు కాశీ వెళ్లే భక్తులతోపాటు ఉత్తరాదికి వెళ్లే ఇతర ప్రయాణికులూ ఈ రైళ్లలో టికెట్లు బుక్‌ చేసుకుంటుండటంతో డిమాండ్‌ మరింతగా పెరిగిపోయింది. దీనితో భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకుని మళ్లీ టికెట్లు బుక్‌ చేసుకోవాల్సి వస్తోంది. 

డిమాండ్‌ ఉన్నా రైలు లేదు: కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగు వారే ఎక్కువ. నిత్యం రెండు వేల మంది వరకు కాశీకి వెళతారని ఒక అంచనా అందులో రైలు ద్వారా వెళ్లేవారు వెయ్యి మందికిపైగా ఉండగా.. మిగతా వారు రోడ్డు మార్గంలో, అతికొద్ది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే ఆధారం.

బిహార్‌ నుంచి వచ్చి, తిరిగి వెళ్లే కూలీలకూ ఈ రైలే దిక్కు. అయితే ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్‌ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ఆయా మార్గాల్లో క్లోన్‌ రైళ్లను నడిపేది. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో మరో రైలును అదనంగా నడిపేది. దానితో కొంత వరకు వెయిటింగ్‌ లిస్టు ప్రయా ణికులకు అవకాశం దక్కేది. ఇలా సికింద్రాబాద్‌–దానాపూర్‌ మధ్య ఓ క్లోన్‌ రైలును నడిపేవారు. కానీ కరోనా ఆంక్షల సమయంలో నిలిపివేసిన ఆ రైలును మళ్లీ పునరుద్ధరించలేదు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం స్వయంగా రైల్వే బోర్డును కోరినా స్పందన రాలేదు. రైల్వే స్పందించి అదనపు రైలు వేయాలని, లేదా క్లోన్‌ రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు