యాదాద్రి ప్రసాదంలో ప్లాస్టిక్‌ కవర్‌ 

15 Dec, 2021 02:24 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వడ ప్రసాదంలో ఓ భక్తుడికి ప్లాస్టిక్‌ కవర్‌ ప్రత్యక్షమైంది. భక్తుడు దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన సందీప్‌ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 11న యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. స్వామి వారి నిత్య కల్యాణ వేడుకలో పాల్గొన్న వీరికి వడ ప్రసాదం అందజేశారు.

ఇంటికెళ్లిన తర్వాత సోమవారం రాత్రి వడ ప్రసాదం తింటున్న సమయంలో అందులో ప్లాస్టిక్‌ కవర్‌ తగిలింది. దీంతో సందీప్‌ ‘‘ఎవరైనా చూసుకోకుండా తింటే ప్రాబ్లెమ్‌ అవుతుంది..దేవస్థానం వారు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను’’అంటూ వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశారు. ఈ విషయమై దేవస్థానం సూపరింటెండెంట్‌ అశోక్‌ను సాక్షి వివరణ కోరగా..ప్రసాదం తయారీ గోదాంలో బియ్యం బ్యాగులు ఉంటాయని వాటిపై ఉన్న కవర్‌ చిన్నది పడినట్లుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.   

మరిన్ని వార్తలు