Kurella Vittalacharya-PM Modi: మోదీ నోట.. కూరెళ్ల మాట

27 Dec, 2021 04:43 IST|Sakshi
కూరెళ్ల గ్రంథాలయంలోని పుస్తకాలు 

ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంపై మన్‌కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రధాని 

ఇంటిని గ్రంథాలయంగా మలచి అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసలు 

రామన్నపేట/సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశప్రజలను ఉద్దేశించి చేసిన ‘మన్‌కీబాత్‌’ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య పేరును ప్రస్తావించడం సాహిత్య ప్రియుల్లో ఆనందం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల విఠలాచార్య స్వగ్రామంలో తన ఇంటిని గ్రంథాలయంగా మలచి అద్భుతంగా నిర్వహిస్తుండడాన్ని ప్రధాని ప్రశంసించారు.

డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య తమ ఇంట్లో 2013లో 70 వేల పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. అనంతరం ఆచార్య కూరెళ్ల ట్రస్ట్‌ ఏర్పాటు చేసి తన కుమార్తెలు, దాతల సహకారంతో పాత ఇంటిస్థానంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. సాహితీవేత్తలు, ఉన్నత విద్యనభ్యసించే వారితో పాటు పరిశోధక విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే కూరెళ్ల విఠలాచార్య సేవాతత్పరత గురించి ప్రధానమంత్రి మాటల్లోనే .. నా ప్రియమైన దేశ ప్రజలారా.. మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభావంతులతో సుసంపన్నమైనది. ఆ ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనడానికి కూరెళ్ల విఠలాచార్య ఒక ఉదాహరణ.

పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్యగారికి చిన్నప్పటి నుంచి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కూరెళ్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. తర్వాత విఠలాచార్య తెలుగు అధ్యాపకుడు అయ్యారు. అనేక సృజనాత్మక రచనలు చేశారు. ఆరేడు సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

తన స్వంత పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు సహకరించటం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో గల ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆయన కృషితో స్ఫూర్తి పొంది ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో ఉన్నారు.  

ప్రధాని ప్రశంస మధురానుభూతి 
పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టు చేయాలనే సంకల్పంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. ఇంటిని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంగా మార్చాను. కవులు, రచయితలు వివిధ సంస్థల సహకారంతో 2 లక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో నా ప్రయత్నాన్ని ప్రశంసించడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా నిలుస్తుంది. 


– డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య

మరిన్ని వార్తలు