సీపీఐ ‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

24 Nov, 2021 01:33 IST|Sakshi
నిరసన తెలుపుతున్న సీపీఐ శ్రేణులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు 

రైతు వ్యతిరేక చర్యలపై నిరసన తెలిపిన సీపీఐ 

అడ్డుకుని పలువురిని అరెస్టు చేసిన పోలీసులు 

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నరసింహ డిమాండ్‌ చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ స్టేట్‌మెంట్‌లు ఇవ్వడానికే సమయాన్ని వృథా చేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం మీడియాలో కనిపిస్తూ మాట్లాడితే సరిపోతుందనే భావనతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో రాజ్‌భవన్‌’ ప్రదర్శన చేపట్టారు. హిమాయత్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న సత్యనారాయణరెడ్డి భవన్‌ వద్ద సీపీఐ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపాయి. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో సీపీఐ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాటలు, పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ‘రండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు బద్దలు కొడదాం–రైతన్నకు అండగా నిలుద్దాం’. ‘ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ డౌన్‌.. డౌన్, రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలుసులు నిరసనకారులను అరెస్ట్‌ చేసి నారాయణగూడ, బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బోస్, రాష్ట్ర సమితి సభ్యుడు శంకర్‌నాయక్, ఛాయాదేవి, రమావత్‌ అంజయ్యనాయక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్‌ ప్రేమ్‌ పావని తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు