హైదరాబాద్‌ గల్లీగల్లీ జల్లెడ: రంగంలోకి వేల మంది పోలీసులు

15 Sep, 2021 18:46 IST|Sakshi

పోలీసుల ముమ్మర తనిఖీలు

ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్‌ పరిశీలన

మద్యం దుకాణాల వద్ద మఫ్టీలో నిఘా

చివరగా ఉప్పల్‌లో కనిపించిన రాజు

రంగంలోకి దిగిన హోంమంత్రి, డీజీపీ

త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు.

చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ

ఈ కేసులో డీజీపీ మహేందర్‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిసిప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్‌లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి

ఇక వీరితో పాటు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు కూడా.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు