50 వేల మందికి శిక్షణ

29 Mar, 2022 02:33 IST|Sakshi

గతంలో ఈ సెంటర్లలో కోచింగ్‌ పొందిన వేలమందికి ఉద్యోగాలు 

తాజా నోటిఫికేషన్‌ కోసం ఫ్రీ కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు పోలీసుశాఖ నిర్ణయం 

హైదరాబాద్‌ సహా అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో శిక్షణకు చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ కల్పనలో పోలీస్‌ శాఖ కీలకంగా పనిచేస్తోంది. యువతకు నిర్దిష్టమైన ప్రణాళికతో ఫ్రీ కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుతో వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50వేల మం దికిపైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు.  హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గతంలో 5,800 మందికి ముందస్తు కోచింగ్‌ ఇవ్వగా 1,300 మందికి పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు లభించాయి.

వరంగల్‌ పరిధిలో 2 వేల మందికిగాను 324 మందికి కొలువులు వచ్చాయి. పోలీస్‌ శాఖలో 18 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో మరోసారి కీలకపాత్ర పోషించ బోతోంది. నగర కమిషనరేట్‌ పరిధిలోని 5 జోన్లలో వెయ్యి మంది చొప్పున శిక్షణ ఇప్పించాలని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయించారు. మహిళా అభ్యర్థులు ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి వారికి ప్రత్యేకంగా సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఇండోర్, ఔట్‌ డోర్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్‌లో రాత పరీక్ష కోసం ఆయా సబ్జెక్టులపై నిష్ణాతులైనవారితో క్లాసులు నిర్వహించి, ప్రతివారం టెస్టులు పెట్టనున్నారు. ఔట్‌డోర్‌లో ఫిజికల్‌ టెస్టుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్‌రోల్‌మెంట్‌కు స్పందన భారీగా ఉంటే స్క్రీనింగ్‌ కూడా అదే స్థాయిలో నిర్వహించి 5 వేల మందిని ఎంపిక చేసి కోచింగ్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

సైబరాబాద్‌లో షురూ.. 
ఐటీ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్న సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర రెండు రోజుల క్రితమే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. శంషాబాద్‌ జోన్‌లో 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన జోన్లలోనూ ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి ట్రైనింగ్‌ కార్యక్రమాలు ఇవ్వాలని సీపీ భావిస్తున్నట్టు కమిషనరేట్‌ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇచ్చిన కోచింగ్‌లోనూ సత్ఫలితాలు వచ్చినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.  

రాచకొండలోనూ ఏర్పాట్లు 
రాచకొండ కమిషనరేట్‌లోనూ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సీపీ మహేశ్‌ భగవత్‌ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. యూపీఎస్సీలో అనేకమంది అభ్యర్థులకు మార్గదర్శకులుగా వ్యవహరించి, అద్భుత ఫలితాలు సాధించిన అధికారిగా మంచి గుర్తింపు పొందిన ఆయన పోలీస్‌ ఉద్యోగాల భర్తీలోనూ ప్రముఖ పాత్ర పోషించనున్నారు. యువతకు వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా గైడ్‌ చేస్తున్నారు. మూడు జోన్ల పరిధిలో ఎన్‌రోల్‌మెంట్‌ నిర్వహించి ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిసింది.

అటు జిల్లాల్లోనూ... 
ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు, సూర్యాపేట నుంచి నిజామాబాద్‌ వరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో జిల్లాకు వెయ్యి మంది చొప్పున ముందస్తు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో రామగుండం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్‌ కమిషనరేట్లలో ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి యువత భారీస్థాయిలో పోటీ పడుతుండటంతో ముందస్తు శిక్షణ స్పందన అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు