సర్వీసు అధికారులు వెయిటింగ్‌లో.. రిటైర్డ్‌ అధికారులు పోస్టింగ్‌లో.. 

4 Sep, 2022 03:24 IST|Sakshi

ఓఎస్డీల పేరుతో ఏళ్ల పాటు రిటైర్డ్‌ అధికారుల పెత్తనం

పోలీస్‌ శాఖలో కీలక అధికారాలు వాళ్ల దగ్గరే

మారని యంత్రాంగం.. ఏళ్ల కొద్దీ అటాచ్‌మెంట్‌ల పేరుతో ఐపీఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్‌ రంగమైనా ఉద్యోగానికి ఒక రిటైర్మెంట్‌ వయసు ఉంటుంది. కీలక విభాగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో పనిచేసే అధికారుల పదవీ విరమణ వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే సలహాదారుడి గానో లేదా ఓఎస్డీగానో కొద్ది రోజులు నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ పోలీస్‌ శాఖలో మాత్రం రిటైరై ఎన్నేళ్లయినా ఫర్వాలేదు.. ఓఎస్డీ, చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ లాంటి పేర్లతో కీలక విభాగాలకు బాస్‌లుగా చలామణి అవ్వొచ్చు.

రాష్ట్రం ఏర్పడకముందు ఇద్దరు, ముగ్గురు అధికారులు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో పేరుతో ఏళ్లపాటు ఓఎస్డీలుగా పెత్తనం చెలాయించారు. తీరా తెలంగాణ ఏర్పడిన తర్వాత రిటైరైన అధికారులు పదవిలో కొనసాగుతున్న అధికారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా పోలీస్‌ శాఖలోని కీలక విభాగాలతోపాటు డిప్యుటేషన్‌ యూనిట్లలోనూ ఇదే రకమైన ఓఎస్డీల పెత్తనం పెరిగిపోయింది.

అత్యంత కీలక విభాగంలో... 
రాష్ట్ర పోలీస్‌ శాఖకే కాదు, ప్రభుత్వానికీ ఇంటెలిజెన్స్‌ విభాగం అత్యంత కీలకం. ప్రతీక్షణం శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు.. ఇలా ప్రతీ అంశాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రభుత్వానికి నివేదించాలి. ఇలాంటి విభాగంలోని కీలకమైన ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో) మొత్తం పదవీ విరమణ పొందిన అధికారుల పెత్తనంలోనే నడుస్తోందన్న ఆరోపణలున్నాయి.

చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ పేరుతో రిటైర్డ్‌ ఐజీ, ఓఎస్డీల పేరుతో మరో ముగ్గురు నాన్‌కేడర్‌ అదనపు ఎస్పీలు ఎస్‌ఐబీని నడిపిస్తున్నారనే చర్చ పోలీస్‌ శాఖలో జరుగుతోంది. మరోవైపు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ (సీఐసెల్‌) విభాగంలో రిటైరైన ఇద్దరు అదనపు ఎస్పీలు, ట్రాన్స్‌కోలో ఓ రిటైర్డ్‌ అదనపు ఎస్పీ, పోలీస్‌ అకాడమీలో ఒక రిటైర్డ్‌ ఎస్పీ, ఏసీబీలో రిటైరైన ఓ ఐఈపెస్‌ అధికారి ఏళ్ల నుంచి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ పేరుతో కొలువులో ఉన్నట్లు తెలిసింది.

ఇకపోతే నగర కమిషనరేట్‌కు అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి డీసీపీగా నేతృత్వం వహిస్తున్న అధికారి సైతం ఏళ్ల నుంచి ఓఎస్డీగా పనిచేస్తుండటం గమనార్హం. ఇలా మొత్తం పోలీస్‌ శాఖలో 23 మంది పదవీ విరమణ పొందిన అధికారులు ఓఎస్డీ పేరుతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

వెయిటింగ్‌లో 43 మంది 
అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్న సామెత రాష్ట్ర పోలీస్‌ శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు 43 మంది ఐపీఎస్‌ అధికారులు పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. వీరిని వివిధ విభాగాలకు అటాచ్‌మెంట్ల పేరుతో అంతర్గత ఆదేశాలు ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ కీలక విభాగాల్లో ఐపీఎస్‌లు చేయాల్సిన విధులను రిటైరైన అధికారులకు ఇచ్చి కూర్చోబెట్టడం వివాదాస్పదమవుతోంది.

రిటైరై ఓఎస్డీగా ఉన్న అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా సంతకాలు గానీ, ప్రతిపాదనలపై పెత్తనం గానీ చేయకూడదు. కానీ వీరు ఏకంగా అధికారిక ఉత్తర్వులపై సంత కాలు చేస్తూ వివాదానికి తెరలేపుతున్నారు. సర్వీస్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్‌ అధికారులను కాదని రిటైరైన అధికారులకు పెత్తనం ఇవ్వడం వెనకున్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు