సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీతో సైబర్‌ నేరాల ఆటకట్టు

12 Jun, 2022 00:45 IST|Sakshi

ఐటీ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు

జాతీయ సదస్సులో డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, ఐఐటీ, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో సైబర్‌ సేఫ్టీ, జాతీయ భద్రత అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో డీజీపీ మహేందర్‌ రెడ్డి హాజరై ప్రసంగించారు. సైబర్‌ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 

ప్రతీ స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌
సైబర్‌ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్‌ కీలక పాత్ర పోషిస్తోందని దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800 లకు పైగా పోలీస్‌ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్‌ ఆఫీసర్లను సైబర్‌ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్రస్థాయిలోను సైబర్‌ నేరాల పరిశోధన విభాగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

సైబర్‌ నేరం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సదస్సుల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, కేంద్ర హోంశాఖ డైరెక్టర్‌ పౌసమి బసు, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఇంటెలిజెన్స్‌ ఐజీ రాజేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు