మహిళలూ.. పోలీసులవ్వండి

20 Apr, 2022 01:59 IST|Sakshi

33 శాతం రిజర్వేషన్‌ వినియోగించుకోండి: పోలీస్‌ అధికారులు 

చదువుతో పాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కూడా కీలకమే 

పెళ్లయిన, పిల్లలున్న మహిళలు నిలకడగా శ్రమించాలి 

వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోవాలి 

త్వరలోనే హైదరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ మొదలవుతుందని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమలులోకి వచ్చాక తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఇతర తత్సమాన కేటగిరీల్లో మొత్తం 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలే ప్రకటించింది. కొత్త జోనల్‌లో కానిస్టేబుల్‌ పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో ఈసారి మహిళా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

నియామకాల్లో భాగంగా సివిల్‌ కేటగిరీలో మహిళలకు 33 శాతం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 10 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోందని చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే ఫిజికల్‌ టెస్టుల్లో మహిళలకు కొంత మినహాయింపులు ఉంటాయని, వీటిని వినియోగించుకొని ఖాకీ కొలువులు సాధించాలని సూచిస్తున్నారు. 

15,575 కానిస్టేబుల్‌.. 538 ఎస్‌ఐ పోస్టులు 
తాజాగా 16,113 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 15,575 కానిస్టేబుల్, 538 ఎస్‌ఐ పోస్టులున్నాయి. పురుష అభ్యర్థుల తరహాలో మహిళా అభ్యర్థులకు కూడా భౌతిక, శారీరక దారుఢ్య పరీక్షలుంటాయి. కాబట్టి ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమవుతూనే సమాంతరంగా ఫిజికల్‌ టెస్ట్‌లకు కూడా సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

వివాహితులు, పిల్లలు న్న మహిళా అభ్యర్థులు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, లేదంటే శారీరక దారు ఢ్య పరీక్షల వేళ కళ్లు తిరిగి పడిపోవడం, డీహైడ్రేషన్‌ లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఉదయం 7 గంటల్లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే మైదానంలో ప్రాక్టీస్‌ చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోవాలంటున్నారు.  

3 కమిషనరేట్ల పరిధిలో.. 
పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమైన వారిని పోలీస్‌ శాఖ ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్లలో సైబరాబాద్‌లోని బాలా నగర్, శంషాబాద్‌ జోన్‌లలో శిక్షణ ప్రారంభమైంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లో స్క్రీనింగ్‌ టెస్టులు పూర్తయ్యాయి. త్వరలోనే శిక్షణ ప్రారంభం కానుంది. బాలానగర్‌ జోన్‌లో 1,050 మందికి శిక్షణ ఇస్తుండగా ఇందులో 300 మంది మహిళలు న్నారు. శంషాబాద్‌లో 1,400 మంది ట్రైనింగ్‌లో ఉండగా 500 మంది మహిళా అభ్యర్థులున్నారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండు బ్యాచ్‌లు చేసి శిక్షణ ఇస్తున్నారు. 60–70 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి 9 వేల మంది దరఖాస్తులు చేసుకోగా 6,085 మంది అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్ట్‌కు హాజరయ్యారు. ఇందులో 1,383లకు పైగా మహిళా అభ్యర్థులున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రీ రిక్రూట్‌మెంట్‌ ఎలిజిబులిటీ టెస్టుకు 16 వేల మంది హాజరయ్యారు. ఇందులో 5 వేల మందికి పైగా మహిళలున్నారు. 

మూడు దశల్లో పరీక్షలు 
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు 3 దశల్లో పరీక్షలుంటాయి. తొలుత ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌ టెస్ట్‌ ఉంటుంది. పరుగు పందెం, లాంగ్‌ జంప్, షాట్‌పుట్‌ దేహదారుఢ్య పరీక్షలుంటాయి. మూడింటిలో రెండింటిలో అర్హత సాధించాలి. ఇందులో 100 మీటర్ల పరుగులో అర్హత తప్పనిసరి. తర్వాత తుది రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తారు.

అర్హతలివే.. 
ఎస్‌ఐ పోస్టులకు ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలలోని అభ్యర్థులకు అర్హతలో సడలింపులుంటాయి. వయసు 21–25 ఏళ్ల మధ్య ఉండాలి.  
కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

ఇతర రంగాల్లోని మహిళలకు ఆదర్శం 
మహిళలు పోలీస్‌ ఉద్యోగం సాధిస్తే మహిళా సాధికారతే కాదు.. సమాజంలో ఆదర్శంగా ఉంటారు. ఇతర రంగాల్లోని స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తారు. త్వరలోనే మాదాపూర్‌ జోన్‌లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తాం.  

– కె. శిల్పవల్లి, డీసీపీ, మాదాపూర్‌ జోన్‌ 

మీపై మీరు నమ్మకం పెట్టుకోండి 
పోలీస్‌ ఉద్యోగం అనేది శారీరక, మానసిక సామర్థ్యానికి పరీక్ష. అందుకే మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. ఇతరుల కంటే మీరేం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో సిద్ధంకండి. 

–రక్షిత కృష్ణమూర్తి, డీసీపీ, మల్కాజ్‌గిరి జోన్‌ 

శారీరక కొలతలు 
ఎత్తు: 152.5 సెంటీమీటర్లు  
బరువు: 45.5 కిలోల కంటే తక్కువ ఉండొద్దు.

ఫిజికల్‌ టెస్టులివే 
100 మీటర్ల పరుగు: 26 సెకన్లు 
లాంగ్‌ జంప్‌: 2.5 మీటర్లు 
షాట్‌పుట్‌ (4 కిలోలు): 3.75 మీటర్లు  
(మహిళా అభ్యర్థులకు హై జంప్, 800 మీటర్ల పరుగు ఉండవు)  

మరిన్ని వార్తలు