ఇక్కడ​ నుంచి కదలరు..  ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్‌ వచ్చినా..  

10 Jun, 2021 08:08 IST|Sakshi

సాక్షి , కరీంనగర్‌: ఎస్సైగా అడుగుపెట్టడంతో మొదలైన ప్రయాణం ఏసీపీగా పదోన్నతి పొందినా స్థానచలనం కదలడం లేదు. రెండు మూడేళ్లు ఒకే పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేసిన తరువాత బదిలీ కావలసివస్తే... పక్క పోలీస్‌స్టేషన్‌కో లేదంటే పక్క నియోజకవర్గానికో మారుతుంది. గత కొన్నేళ్లుగా కరీంనగర్‌లో కొందరు పోలీస్‌అధికారుల పోస్టింగులు ఉమ్మడి జిల్లాతో పాటు నార్త్‌జోన్‌లోనే చర్చనీయాంశంగా మారాయి. పోలీస్‌శాఖలో పలుకుబడి, రాజకీయ అండదండలు ఉంటే ఎన్నేళ్లయినా ఒక ప్రాంతంలోనే కొనసాగవచ్చుననే దానికి కరీంనగర్‌లో పోస్టింగ్‌ల తీరును పరిశీలిస్తే అర్థమవుతోంది. కరీంనగర్‌ రావడానికి ఇతర నియోజకవర్గాల తరహాలో ‘ఖర్చు’ ఉండకపోవడం... సంపాదనకు ఢోకా లేకపోవడంతో పాటు ఎస్సైలుగా ఉన్నప్పుడే పిల్లల చదువులు, స్థిర నివాసాలకు కరీంనగర్‌ను ఎంపిక చేసుకోవడం కూడా కారణమవుతోంది. దాంతో నగరానికి అలవాటైన అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు.

అయినవారికి అందలం
ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మండలంలో గానీ పట్టణంలో గానీ సీఐ, ఎస్సైగా పోస్టింగ్‌ రావాలంటే స్థానిక ఎమ్మెల్యే రికమండేషన్‌ తప్పనిసరి. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని అటవీప్రాంతాల నుంచి కరీంనగర్‌కు రావాలన్నా, తప్పనిసరై కరీంనగర్‌ నుంచి వేరే ‘మంచి’ మండలానికి బదిలీపై వెళ్లాలన్నా తొలుత ఎమ్మెల్యే సిఫారసు ముఖ్యం. కొన్ని నియోజకవర్గాల్లో పోలీస్‌ అధికారుల పోస్టింగ్‌ సిఫారసులకు కూడా రేట్లు ఫిక్స్‌ అయ్యాయనేది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేల సిఫారసులు, పోలీసు ఉన్నతాధికారుల ఆశీస్సులు లేనివారు అటవీ ప్రాంతాల్లోనో, ఎస్‌బీ, సీసీఎస్‌ తదితర పోస్టింగుల్లోనో సర్దుకుంటున్నారు. ఎస్సై నుంచి సీఐ, ఏసీపీ/డీఎస్పీ పోస్టింగ్‌లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సాధారణ ఎన్నికల సమయాల్లో ఒకే జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన అధికారులను బదిలీ చేయడం ఆనవాయితీ. ఆ కారణంగా బదిలీ అయి పక్క జిల్లాలకు వెళ్లినా, ఎన్నికల తరువాత తిరిగి సొంత జిల్లాలకు వచ్చిన వారు ఎక్కువగానే ఉన్నారు. కాగా కరీంనగర్‌ చుట్టుపక్కల పోస్టింగ్‌ సంపాదించాలని ప్రయత్నించే చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. ఇతర ప్రాంతాల వారు గానీ, ఇతర జిల్లాల వారు గానీ కరీంనగర్‌కు రావడం కష్టమైన పనేఅని పోలీసు వర్గాలే చెపుతున్నాయి. పెద్ద పైరవీ ఉంటే తప్ప వరంగల్‌ జోన్‌లోని ఇతర జిల్లాల నుంచి కరీంనగర్‌కు రావడం అంత ఈజీ కాదనేది వాస్తవం.

ఎస్సై నుంచి సీఐ, ఏసీపీలుగా ఇక్కడే..
  కరీంనగర్‌లో ఎస్సైగా పనిచేసిన అధికారి తరువాతకాలంలో స్థానికంగానే సీఐగా, ఏసీపీగా బాధ్యతలు నిర్వహించిన ఉదంతం ఉంది. ఒకే స్టేషన్‌లో ఎస్సై,సీఐగా బాధ్యతలు నిర్వర్తించిన వారు కూడా ఎక్కువే.
 వరుసగా కరీంనగర్‌ పరిధిలోని స్టేషన్లలో పనిచేసిన వారు కొందరైతే ... తప్పనిసరి బదిలీపై వేరే స్టేషన్లకు వెళ్లినా, తరువాత మళ్లీ కరీంనగర్‌లో పోస్టింగ్‌లు పొందిన వారు ఉన్నారు. వేరే ప్రాంతాలకు లేదా జిల్లాలకు వెళ్లిన అధికారులు సైతం  ‘మంచి’ స్టేషన్‌లలో పనిచేసే అవకాశాన్నే పొందుతున్నారు. 
 ఇటీవల ఏసీపీలుగా పదోన్నతి పొందిన వారిలో కొందరు కరీంనగర్, చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లోని కీలక పోలీస్‌స్టేషన్లలోనే విధులు నిర్వర్తించారు.
 కరీంనగర్‌ పట్టణంలోని త్రీటౌన్, టూ టౌన్, వన్‌టౌన్‌.. మూడు స్టేషన్లలో సీఐగా పనిచేసిన చరిత్ర ఓ అధికారికి ఉంది. ఏసీపీగా పదోన్నతి తరువాత కూడా ఆయన కరీంనగర్‌లోనే ఓ విభాగానికి బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం.
 మరో అధికారి కరీంనగర్‌ ఎస్సైగా పనిచేసి తరువాత సీఐ పదోన్నతితో ఉమ్మడి జిల్లాలో కొంతకాలం విధులు నిర్వర్తించారు. తరువాత కరీంనగర్‌లో రెండు పోలీస్‌స్టేషన్లలో సీఐగా పనిచేసి ఇటీవలే ఏసీపీ అయ్యారు. 
గతంలో కరీంనగర్‌లోనే ఓ స్టేషన్‌ ఎస్సైగా పనిచేసిన అధికారి పదోన్నతి తరువాత టూటౌన్, ట్రాఫిక్, ఎస్‌బీ, తిమ్మాపూర్‌లో సీఐగా విధులు నిర్వర్తించారు. ఆయన కూడా మరోసారి కీలక విభాగానికి ఏసీపీగా కరీంనగర్‌కే రాబోతున్నట్లు తెలిసింది. 
 వీరే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఎక్కువకాలం పనిచేసి ఏసీపీలుగా పదోన్నతి పొందిన మరో ఇద్దరు అధికారులు కూడా కరీంనగర్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
► కరీంనగర్‌తో మంచి సంబంధాలున్న నలు గురు ఏసీపీలుగా విధుల్లో చేరనున్నారు.

కరీంనగర్‌ చుట్టుపక్కల  పనిచేసిన మరికొందరు.. 
 ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ స్టేషన్‌ సీఐగా పనిచేస్తున్న అధికారి గతంలో కరీంనగర్‌ రూరల్‌ ఎస్సైగా çపనిచేశారు. ఆయన గత సంవత్సరం చివరలో జగిత్యాల జిల్లా నుంచి కరీంనగర్‌కు వచ్చారు.
 కరీంనగర్‌ పక్కనే ఉన్న ఓ కీలక స్టేషన్‌కు ఇటీవల బదిలీ అయిన ఓ అధికారి గతంలో కరీంనగర్‌లోని ఓ స్టేషన్‌ ఎస్సైగా, రూరల్, టాస్క్‌ఫోర్స్‌ సీఐగా పనిచేశారు. 
 ఓ మహిళా పోలీస్‌ అధికారి గతంలో కరీంనగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్,  చొప్పదండిలో ఎస్సైగా పనిచేశారు. ఆమె తరువాత కాలంలో అదే మహిళా పోలీస్‌ స్టేషన్‌కు, పక్కనున్న మానకొండూర్‌కు సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. హుజూరాబాద్‌లో సీఐగా పనిచేశారు. ప్రస్తుతం సీపీటీసీ సీఐగా విధుల్లో కొనసాగుతున్నారు.
 ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ స్టేషన్‌ సీఐగా పనిచేస్తున్న అధికారి గతంలో హుజూరా బాద్‌తో పాటు ఎస్‌బీ, మహిళా పోలీస్‌స్టేషన్‌లకు సీఐగా విధులు నిర్వర్తించారు. అంతకు ముందు ఎల్‌ఎండీ, కరీంనగర్‌ టూటౌన్, వీణవంక ఎస్సైగా పనిచేశారు. 
 నిన్న మొన్నటి వరకు కరీంనగర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న అధికారి ఇటీవలే అదే ఆవరణలో ఉన్న మరో పోలీస్‌ స్టేషన్‌కు సీఐగా బదిలీ అయ్యి విధులు నిర్వహిస్తున్నారు. 

చదవండి: కొంప ముంచుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు