పోలీసుల నిర్బంధంలో హుజూరాబాద్‌

16 Aug, 2021 02:18 IST|Sakshi
జమ్మికుంటలో మాట్లాడుతున్న ఈటల

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ 

ఇల్లందకుంట (హుజురాబాద్‌): హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలీసుల నిర్బంధం, చీకటిరాజ్యం నడుస్తోందని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుజూరాబాద్‌ ప్రజల మీద తోడేళ్లలాగా విరుచుకుపడుతున్నారని, బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీని తెలంగాణలో నిషేధిత పార్టీగా చూస్తున్నారని.. చరిత్రలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ మరింత దిగజారి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

ఇంటెలిజెన్స్‌ ప్రభాకర్‌రావు టీం సభ్యులు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారని, వారిపై కేంద్ర హోంమంత్రికి, హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రశ్నించేవారందరినీ ఏ చట్టం ప్రకారం అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. నక్సలైట్లకు అన్నం పెట్టినవారిని వేధించినప్పటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, జీడీ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు