ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోల మృతి 

8 Sep, 2020 03:47 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలు

చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ఘటన 

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప – వద్దిపేట మధ్యలోని అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్‌ 6న గుండాల మండలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ 6న బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే. దీంతో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడవచ్చనే అనుమానంతో చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం నుంచి కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా ప్రాంతంలో 1 ఎస్‌బీబీఎల్‌ తుపాకీ, 1 పిస్టల్, రెండు కిట్‌ బ్యాగులు లభించాయి. మృతదేహాలను సంఘటన ప్రాంతం నుంచి సోమవారం రాత్రి చర్లకు చేర్చారు.  

మందుపాతర పేల్చివేత 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు చర్ల మండలంలోని పెదమిడిసిలేరు–తాలిపేరు ప్రాజెక్ట్‌ మధ్యలో ప్రధాన రహదారిపై శక్తివంతమైన మందుపాతరను పేల్చారు. కాగా, సోమవారం మధ్యాహ్నం పోలీసులకు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం భయాందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు