తెలంగాణ: సరెండర్‌ సెలవుల డబ్బులేవి?

10 Nov, 2021 14:40 IST|Sakshi

పీఎఫ్‌ విత్‌డ్రాకూ అవకాశం లేని పరిస్థితి 

వేలల్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు

పోలీస్‌ శాఖలో సిబ్బంది అసహసం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న వేలాది మందికి రావాల్సిన సరెండర్‌ సెలవుల డబ్బులను ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా 30 రోజుల పాటు ఉండే సరెండర్‌ (ఆర్జిత సెలవులు) లీవులను ఉపయోగించుకోలేని వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే గత ఏడాదికి సంబంధించి జూన్‌ నెలలో చెల్లించాల్సిన సరెండర్‌ లీవుల డబ్బులు ఇప్పటివరకు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్ల చుట్టూ తిరిగి అలసి పోతున్నామే తప్ప సమస్య మాత్రం తీరడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
చదవండి: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్‌

ఉన్నా.. ఉపయోగించుకోలేని పరిస్థితి 
పోలీస్‌ శాఖ అంటేనే అత్యవసరమైన విభాగం. పండుగలు, అనుకోని ఘటనలు, సభలు, సమావేశాలప్పుడు రోడ్డుపై బందోబస్తు నిర్వహించాల్సిందే. అది శాంతి భద్రతల విభాగమైనా, బెటాలియన్లు అయినా.. తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సిందే. దీని వల్ల డబుల్‌ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు ఉండే సాధారణ సెలవులనే వాడుకునే అవకాశం దక్కదని, కనీసం సరెండర్‌ లీవులకు సంబంధించిన డబ్బులైనా చెల్లిస్తే పిల్లల ఫీజులు లేదా ఇతరత్రా ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. ప్రతీ పోలీస్‌ ఉద్యోగికి రెండు సార్లు సరెండర్‌ లీవ్‌లకు డబ్బులు చెల్లిస్తారు.
చదవండి: కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజ‌య‌ గర్జన స‌భ మళ్లీ వాయిదా..

ఏటా మొదటి ఆరునెలల కాలానికి వచ్చే 15 సెలవులకు జూన్‌ లేదా జూలైలో, ఆ తర్వాతి ఆరు నెలల్లో ఉండే 15 రోజుల సెలవులకు జనవరిలో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఈ ఏడాది సిబ్బందికి జనవరి నుంచి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల మంది సిబ్బందిలో 80 శాతం మందికి సరెండర్‌ సెలవుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పెండింగ్‌ బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు