ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌...రాత పరీక్షపై కీలక అప్‌డేట్‌..!

28 May, 2022 02:04 IST|Sakshi
వీవీ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కానిస్టేబుల్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 21న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోలీస్, ఎస్‌పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు గురువారం ముగిసింది.

52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు.  

ఆ ఐదు జిల్లాలు టాప్‌...  
భారీగా దరఖాస్తులు దాఖలు చేసిన జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట నిలిచాయి. ఈ జిల్లాల నుంచే 33 శాతం దరఖాస్తులు వచ్చాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల నుంచి అతి తక్కువగా 7 శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి.  
పోస్టులవారీగా దరఖాస్తులిలా... 

  • ఎస్‌ఐ సివిల్, తదితర సమాన పోస్టులు: 2,47,630  
  • సివిల్‌ కానిస్టేబుల్, తదితర సమాన పోస్టులు: 9,54,064  
  •  ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ పోస్టులు: 14,500 
  • ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 22,033  
  • కానిస్టేబుల్‌ డ్రైవర్‌ (పోలీస్‌), 
  • ఫైర్‌ పోస్టులు: 38,060  
  •  మెకానిక్‌ కేటగిరీ పోస్టులు: 5,228 
  • పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ ఎస్‌ఐ: 3,533
  • ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఏఎస్‌ఐ: 6,010 
మరిన్ని వార్తలు