ఫాలో.. పీఆర్‌బీ!

12 Jul, 2021 02:31 IST|Sakshi

ఉద్యోగాల భర్తీకి మార్గదర్శిగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు  రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటు తర్వాత తొలి నోటిఫికేషన్‌ దీనిదే  పీఆర్‌బీ రూల్స్‌ను అనుసరిస్తోన్న ఇతర ప్రభుత్వ శాఖలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన సమయంలో అన్ని శాఖల దృష్టి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (పీఆర్‌బీ)పై పడింది. తెలంగాణలో కొత్త జోన్ల పునర్వ్యవస్థీకరణకు ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన దరిమిలా తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ పీఆర్‌బీ నుంచి వెలువడటంతో.. మిగిలిన శాఖల ఉన్నతాధికారులు ఈ నోటిఫికేషన్‌ జారీలో అవలంబించిన విధి విధానాలను నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. కొత్త జోన్ల వ్యవస్థ అమలును జూన్‌ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు రోజులకే అంటే జూలై 4వ తేదీన పీఆర్‌బీ 151 ఏపీపీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ వెలువరించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మంది (2016లో సుమారు 10 వేలు, 2018లో 15 వేల మంది)ని భర్తీ చేసిన విభాగంగా గుర్తింపు సాధించిన బోర్డు.. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా, పకడ్బందీ నిబంధనలతో ఈ పోస్టుల భర్తీ ప్రకియను చేపట్టింది. త్వరలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 19 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి సైతం బోర్డు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతర శాఖల అధికారులు, పీఆర్‌బీ రూపొందించిన విధానాలపై దృష్టి సారించారు. ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయితే, పీఆర్‌బీ చైర్మన్‌ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో రూపొందించిన ఈ నియామక నిబంధనలను యథాతథంగా తీసుకోవడం గమనార్హం. కొత్త జోనల్‌ వ్యవస్థ  నిబంధనలను ప్రభుత్వమే రూపొందించినప్పటికీ, వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఇతర శాఖలు పీఆర్‌బీ విధివిధానాలను పరిశీలించే పనిలో పడ్డాయి. 

95 శాతం పోస్టులు స్థానికులకే.. 
కొత్త జోనల్‌ వ్యవస్థలో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం పకడ్బందీగా విధివిధానాలను రూపొందించింది. వీటిని అమలు చేసే పనిలో పీఆర్‌బీ ఇప్పటికే ముందడుగు వేసింది. కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం.. నియామకాల్లో తెలంగాణలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం..ఎవరైతే ఒకే జిల్లాలో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యనభ్యసించి ఉంటారో వారినే స్థానికులుగా తీసుకుంటారు. దీని ప్రకారం చూస్తే.. కేవలం 5 శాతం పోస్టులే స్థానికేతరులకు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. ఇలా పొరుగు రాష్ట్రం వారితో పాటు, పక్క మల్టీజోన్‌ వారు కూడా స్థానికేతరులే అయ్యేలా నిబంధనలు రూపొందించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్థానికతను రుజువు చేసుకునేందుకు అభ్యర్థులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెవెన్యూ అధికారుల నుంచి ఏడేళ్ల ‘నివాస ధ్రువీకరణ’ పత్రాన్ని పీఆర్‌బీ అనివార్యం చేసింది. 

సుదీర్ఘ ప్రక్రియ అయినా.. 
మిగిలిన శాఖల్లో ఉద్యోగాల భర్తీ.. పోలీసు పరీక్షల్లా క్లిష్టంగా, అనేక దశల్లో ఉండదు. ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి. పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీ మరో కీలక అంశం. ఆ తర్వాత రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థులపై పోలీసు ఎంక్వైరీ, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికోసం మరో రకమైన విచారణ, యూనివర్సిటీల సాయంతో వారి సర్టిఫికెట్ల నిర్ధారణ, అభ్యంతరాల స్వీకరణ– నివృత్తితో కూడిన సుదీర్ఘ ప్రక్రియ అంతటినీ గతంలో పక్కాగా అమలు చేసిన అనుభవం పీఆర్‌బీకి ఉంది. అందుకే బోర్డు  విధానాలు అదర్శంగా నిలుస్తున్నాయి. 

వివాద రహితంగా ఉండటంతో... 
2018లో రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా పీఆర్‌బీ తమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసింది. ఈ కారణంగానే ఆ సమయంలో తలెత్తిన పలురకాల న్యాయపరమైన అభ్యంతరాలన్నీ పిటిషన్‌ దశలోనే వీగిపోయాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుని, ఉద్యోగ ఖాళీల భర్తీ పనిలో ఉన్న పలు శాఖలు.. పీఆర్‌బీ అనుసరించిన విధానాన్ని పరిశీలిస్తున్నాయి. ఇందులో తమకు కావాల్సిన అంశాలను తీసుకుని అమలు చేయనున్నాయి.  

మరిన్ని వార్తలు