Telangana Police: ఆపదా.. మేమున్నాం పదా!

25 May, 2021 04:23 IST|Sakshi

పోలీసుల స్పందన 

లాక్‌డౌన్‌ సమస్యలపై ట్వీట్ల వెల్లువ 

తక్షణమే స్పందిస్తున్న డీజీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ టీమ్‌ 

ఈపాస్‌ దరఖాస్తులకు కూడా వెంటనే పరిష్కారం 

వైద్యం, ఇతర అత్యవసర సమస్యలకు ప్రాధాన్యం 

నిస్సహాయులకు తెలంగాణ పోలీస్‌ చేయూత 

సార్‌.. నా పేరు సంతోష్‌ కర్ణాటకలో బ్యాంకు ఉద్యోగిని. ఆడిటింగ్‌ కోసం ప్రతివారం హైదరాబాద్‌ రావాలి. ఎలా సార్‌.. అంటూ డీజీపీకి ట్వీట్‌ చేశాడు. నిమిషాల్లో డీజీపీ బృందం స్పందించింది. ఈ–పాస్‌ లింక్‌ పంపి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 
వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉండే 9 నెలల గర్భవతి అయిన స్వర్ణ, ఆమె భర్త అశోక్‌ లాక్‌డౌన్‌ వల్ల సొంతూరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే గమనించిన మామునూరు ఏసీపీ వెంటనే పోలీసు వాహనంలో వారిని ఇంటికి చేర్చారు. 

సాక్షి, హైదరాబాద్‌:  లాక్‌డౌన్‌ కఠినతరం చేసినప్పటి నుంచి, ఎవరికి ఏ సమయంలో ఆపద వచ్చి నా డీజీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ @TelanganaDGP టీమ్‌ వెంటనే స్పందిస్తోంది. ఎక్కడి నుంచి ఏ సమస్యలపై ట్వీట్‌ వచ్చినా.. ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలను అప్రమత్తం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తోంది. ఆకస్మిక మరణాలు, వైద్య సాయం, రక్తదానం తదితర అత్యవసర అంశాలకు టీమ్‌ సభ్యులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో కారణాలు వివరిస్తున్నారు.

ఈ–పాస్‌ https//policeportal.tspolice.gov.in  దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 వేల మందికిపైగా ఈ–పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యవసరమైన వాటన్నిటినీ అనుమతిస్తూ మిగతావి తిరస్కరిస్తున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల వంటి వాటికి సంబంధించి దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉంటున్నాయి.  

సేవా ఆహార్‌ యాప్‌..  
ఈ నెల 7న తెలంగాణ పోలీసులు.. వివిధ ఎన్జీవోలు, ఫుడ్‌ డెలివరీ సంస్థలతో కలిసి ప్రారంభించిన సేవా ఆహార్‌ యాప్‌కు మంచి స్పందన వస్తోంది. రోజుకు 2,200 మంది కరోనా పాజిటివ్‌ రోగులకు ఈ యాప్‌ ద్వారా ఆహారం అందజేస్తున్నారు. ఇప్పటిదాకా 40 వేల ప్లేట్ల భోజనం అందించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నుంచి రోజూ అదనంగా మరో 200 ప్లేట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సేవా ఆహార్‌యాప్‌ లేదా 77996 16163 వాట్సాప్‌ నంబరులో ఉదయం 6 గంటలలోగా ఆర్డర్‌ పెడితే మధ్యాహ్నానికల్లా ఆహారాన్ని ఇంటి వద్దకు లేదా ఆసుపత్రి వద్దకు వచ్చి అందజేస్తారు.  

రోగులు, మహిళలకు చేయూత  
ఉదయంపూట దారితప్పిన, రవాణా సౌకర్యా ల్లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, వృద్ధు లను పోలీసులు క్షేమంగా వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సోమవారం మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ ఆసుపత్రికి వెళ్తున్న మహిళలను పోలీసు వాహనంలో తరలించి చికిత్స అందేలా చూశా రు. సకాలంలో ఇంటికి చేరుకోలేకపోయిన వారిని తమ వాహనం లేదా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపుతున్నారు. సోమవారం అన్ని కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఇలాంటి సహాయ కార్యక్రమా లు చేపట్టారు. దీనికితోడు డయల్‌ 100కి కాల్‌ చేసినా స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించి సాయం అందేలా చూస్తున్నారు.  

మరిన్ని వార్తలు