మూడు రాష్ట్రాల సరిహద్దులోనే... హరిభూషణ్‌?

24 Nov, 2020 04:18 IST|Sakshi

రంగంలోకి తెలంగాణ కార్యదర్శి 

మళ్లీ ‘యాక్షన్‌ టీం’లు... ప్రజాకోర్టులు!? 

వరుస దాడులకు సిద్ధమైన    

మావోయిస్టులు, అధికార పార్టీ నేతలే లక్ష్యం 

తెలంగాణలో పునర్‌వైభవం కోసం వ్యూహం

మావోయిస్టు కమిటీల్లో మళ్లీ మార్పులు, చేర్పులు

పార్టీ ప్లీనరీలో కీలక నిర్ణయాలు.. నిఘావర్గాలకు చిక్కిన పత్రాలు 

సాక్షి , వరంగల్ ‌: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో యాక్షన్‌ టీంలు మళ్లీ రంగంలోకి దిగాయా? వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలే లక్ష్యంగా దాడులకు దిగనున్నారా? తెలంగాణలో పునర్‌వైభవం కోసం ఓవైపు మళ్లీ ప్రజాకోర్టులు, దాడులు, మరోవైపు ‘రిక్రూట్‌మెంట్‌’పై దృష్టి సారించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం పోలీసు, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

ఇదే క్రమంలో 2019 డిసెంబర్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తెలంగాణ, ఆంధ్రా – ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యనేతలతో కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ప్లీనరీకి సంబంధించిన కీలకపత్రాలు నిఘావర్గాల చేతికి చిక్కాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ దళాలు దండకారణ్యం మూడు రాష్ట్రాల (తెలంగాణ– మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్‌) సరిహద్దు, గోదావరి, ప్రాణహిత మధ్య మకాం వేసినట్లు సమాచారం.

రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్‌టీంలు రంగంలోకి దిగినట్లు గుర్తించిన పోలీసులు మూడు నెలలుగా సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా, అక్టోబర్‌ 10న రాత్రి ములుగు జిల్లా బోధాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు భీమేశ్వర్‌రావును మావోలు హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పోలీసుల కూంబింగ్, వరుస ఎన్‌కౌంటర్లలో ఐదుగురు వరకు మావోయిస్టులు మృతి చెందగా, రెండు రోజుల కిందట ప్రజాకోర్టులో ఇద్దరిని ఇన్‌ఫార్మర్ల పేరిట మావోయిస్టులు కాల్చి చంపడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

కమిటీల పునర్వ్యవస్థీకరణ 
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్‌ కమిటీ (ఎన్‌టీఎస్‌జెడ్‌సీ), ఆంధ్ర రాష్ట్ర కమిటీ, ఉత్తరాంధ్ర, ఒడిశాకు కలిపి ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) కమిటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్‌టీఎస్‌జెడ్‌సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్‌సీ)గా మార్చారు. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కనుమరుగు కాగా... ఏఓబీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం – కరీంనగర్‌ – వరంగల్‌ జిల్లాలకు కలిపి
(కేకేడబ్ల్యూ) డివిజినల్‌ కమిటీ ఉండేది.

అయితే తెలంగాణ ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో మావోయిస్టు పార్టీ కూడా తమ రాష్ట్ర కమిటీని పునర్‌వ్యవస్థీకరించింది. కేకేడబ్ల్యూను ఎత్తివేసి దాని స్థానంలో కొత్తగా మూడు డివిజన్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్‌ లక్మ అలియాస్‌ హరిభూషణ్‌ నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా బండి ప్రకాశ్‌ అలియాస్‌ క్రాంతి, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ను నియమించారు.

ఇటీవల కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో రంగంలోకి దిగిన యాక్షన్‌ టీంలకు తెలంగాణ నాయకులు నాయకత్వం వహిస్తుండగా, దాడులకు మాత్రం ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌నే వాడుతున్నారు. గత నెలలో ములుగు జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేత హత్య ఘటనకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముసాకి ఉంజల్‌ అలియాస్‌ సుధాకర్‌ నాయకత్వం వహించడమే ఇందుకు ఉదాహరణ. కాగా దండకారణ్యంలో పోలీసుల గాలింపు, నిఘా ముమ్మరం కావడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఉత్తర తెలంగాణ జిల్లాలను సేఫ్‌ జోన్‌గా ఎంచుకున్న మావోయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తిరిగి కార్యకలాపాలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 

మూడు జిల్లాలకో డివిజన్‌ కమిటీ 
పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని కొత్త కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి – కరీంనగర్‌ – భూపాలపల్లి జయశంకర్‌ – వరంగల్‌ జిల్లాలు కలిపి ఓ డివిజన్‌ కమిటీ కాగా, దీనికి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం – మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ, ఇల్లెందు – నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, వీటికి సుధాకర్, కూసం మంగు అలియాస్‌ లచ్చన్నలను కార్యదర్శులుగా నియమించారు.

మంచిర్యాల – కొమురంభీం(ఎంకేబీ) డివిజినల్‌ కమిటీ నాయకత్వాన్ని ఇంతకుముందు ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌కు అప్పగించారు. అంతేకాకుండా ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్‌ – సిర్పూర్‌ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి డివిజినల్‌ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల – శబరి ఏరియా కమిటీ, లోకే సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్షణ్‌ అలియాస్‌ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్‌ ఏర్పాటు చేశారు.

చర్ల – శబరి ఏరియా కమిటీకి మడకం కోసీ అలియాస్‌ రజిత నాయకత్వం వహిస్తున్నారు. ఇక చర్ల లోకల్‌ ఆర్గనైజింగ్‌ స్క్వాడ్, ఉబ్బ మోహన్‌ అలియాస్‌ సునీల్‌ నేతృత్వంలో శబరి లోకల్‌ ఆర్గనైజింగ్‌ స్క్వాడ్‌లు, ముసాకి ఉంజల్‌ అలియాస్‌ సుధాకర్‌ నాయకత్వంలో వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీలు పని చేస్తున్నాయి. మొత్తంగా ఈ కమిటీలకు సారథ్యం వహిస్తున్న బడే దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, కంకనాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ కోసం ప్రస్తుతం పోలీసుల వేట సాగుతోంది.  

మరిన్ని వార్తలు