అశ్రునయనాలతో తుది వీడ్కోలు

25 Dec, 2022 02:25 IST|Sakshi
కైకాల భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న ఏపీ ఎంపీ బాలశౌరి

అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు 

పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు

సత్యనారాయణ గారి పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా  నా వంతు కృషి చేస్తా: ఎంపీ బాలశౌరి 

రాయదుర్గం(హైదరాబాద్‌): అశ్రునయనాల మధ్య సినీనటుడు కైకాల సత్యనారాయణకు కుటుంబసభ్యులు, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీసు బందోబస్తు, లాంఛనాలతో ఆయన పార్థివదేహాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు.

సత్యనారాయణ చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పు అంటించారు. అంత్యక్రియలకు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ నాయకులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జూబ్లీహిల్స్‌లోని కైకాల నివాసానికి వెళ్లి పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆదేశం మేరకు కైకాల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించి గాలిలోకి మూడుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి వల్లభనేని, టీటీడీ సభ్యుడు దాసరి కిరణ్, ప్రజాగాయకుడు గద్దర్, సినీనిర్మాత అల్లు అరవింద్‌తోపాటు పలువురు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు.  

కైకాల కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం... 
వైకుంఠ మహాప్రస్థానంలో కైకాల పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటించి ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. ‘గుడివాడలో ఉన్న కైకాల కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిపే విధంగా కృషి చేస్తాను. ఆయన స్వగ్రామం కౌతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు నిర్మించటానికి సాయం చేస్తాను. గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా డెవలప్‌ చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక పార్లమెంట్‌ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’అన్నారు.

మరిన్ని వార్తలు