తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ దుకాణం బంద్‌

7 Apr, 2021 17:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావు టీఆర్‌ఎస్‌లో చేరాడు. దీంతో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షంలో టీడీపీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్‌ వెలువడనుంది.

2018 ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో మెచ్చా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు మెచ్చా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌టవీర‌య్య‌తో క‌లిసి లేఖ అందించారు. అనంతరం శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్‌తో కలిసి ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకొచ్చారు. స్పీకర్‌ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది.

చదవండి:  9 నుంచి 19 వరకు మొత్తం బంద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు